Sunday, February 22, 2026

శివలీలార్ణవము ద్వితీయ సర్గ

                       నీలకంఠ దీక్షితుల శివలీలార్ణవము ద్వితీయ సర్గ ( తాత్పర్య విశేషాలతో)

పాండ్యదేశవర్ణన

01

అస్తి క్షితేరాభరణాయమానః

పారేసముద్రం స హి పాణ్డ్యదేశః

ఆశామగస్త్యాధ్యుషితాం గతో౽పి

సర్వోత్తరో యో జగతి ప్రతీతః

భూమికి అలంకారంగా ఉన్న సముద్ర తీరములో పాండ్యమను ప్రసిద్ధి పొందిన దేశము ఒకటుంది. అది  అగస్త్యుని దిక్కులో(దక్షిణము) ఉన్నప్పటికి- దిక్కులవరకు వ్యాపించి ( విశాలమయిన అని భావం) ఆ పాండ్య దేశము భూమిలో సర్వశ్రేష్ఠత్వమును పొందుచున్నది.

విశేషాలు

1. అగస్త్య మహర్షి.

అగంస్త్యాయతే ఇతి-అగ + స్త్య - క. (కృ.ప్ర.) వింధ్య పర్వతమును స్తంభింపచేసినవాడు.

2. కాలకేయులు కశ్యప ప్రజాపతికి కాలయందు పుట్టినవారు కాలకేయులు . వీరు మహాదుర్మార్గులు.

సముద్రమున దాగి ఉండి బహువిధముల దేవతలను బాధించేవారు.

3. అగస్త్యుడు దేవతలచేత ప్రార్థింపబడి కాలకేయుల నివాసస్థానము ఐన సముద్రము యొక్క జలమునంతా పానము చేసాడు. తరువాత సముద్రము కావలెనని అందరూ కోరగా తాను ఆచమించిన సముద్రమును మూత్రద్వారమున విడిచిపెట్టాడని పురాణకథ. దీనినే అగస్త్యా ధ్యుషితాం (అగస్త్యుని నివాసము) అని దీక్షితుల వారు అన్నారు

4. దక్షిణదిక్కునందు నక్షత్రరూపముగానున్న అగస్త్యుని ఉదయాన్ని అగస్త్యోదయము అంటారు. భాద్రపదమాసమున జరుగును. అగస్త్యోదయమయినపుడు నదులలోని జలము తేటగా అవుతాయి.

వింధ్యపర్వత గర్వాన్ని అణచాలని ఆ ప్రాంతానికి వచ్చి అక్కడి వారికి అగస్త్యుడు  సాయం చేసేవాడు. అందుకే దక్షిణ దిక్కును అగస్త్యదిక్కు అని కూడా అంటారు .

02

ఆస్థాయ వైరాగ్యమనుత్తమం య

స్త్ర్రైలోక్య లక్ష్మీం న తృణాయ మేనే

యదాధిపత్యస్పృహయా స ఏవ

దేవో దధే సున్దర పాణ్డ్యరూపమ్

తాత్పర్యము

ఎవడు  లోకోత్తరమయిన వైరాగ్యమును వహించి త్రైలోక్య లక్ష్మిని గడ్డి పరకలా లెక్కింపడో,

అతడే  ఆ అధికారానికి ఇష్టపడి మధురలో సుందరపాండ్య రూపాన్ని ధరించాడు.

03

సుదుష్కరం యత్ప్రతిసర్గమేవ

పశ్యన్మునిః ప్రాగ్విరరామ సర్గాత్

న శుష్కయా సాన్త్వగిరా సురాణాం

కిమ్ గాధి సూనోరపి శాన్తిరస్తి

తాత్పర్యము

ఇదివరలో (త్రిశంకు కథా ఘట్టములో) సృష్టికి ప్రతి సృష్టి చేయదలచిన విశ్వామిత్రుడు పాండ్య నగరమునకు ప్రతిసృష్టి ఎలా అయినా సాధ్యం కాదని తన ప్రతి సృష్టి మానుకొన్నాడు. అంతేకాని దేవతల ఓదార్పు మాటల వలన కాదు. విశ్వామిత్రునకు ఎప్పుడయినా శాంతి ఉన్నదా? 

విశేషాలు

గాధి

కుశాంబుని కొడుకు. విశ్వామిత్రుని తండ్రి. శ్రీమద్వాల్మీకి రామాయణమున ఇతడు కుశనాభుని కొడుకు అని ఉన్నది.

విశ్వామిత్రుడు .

విశ్వానికి అమిత్రుడు అని విశ్వామిత్ర పదాన్ని చదివి భ్రమ పడతాం. (విశ్వ +అమిత్ర) కాని ఆయన విశ్వానికి మిత్రుడు. మిత్రే చర్షౌఅని ఒక సిద్ధాంత కౌముదిలో ఒక సూత్రం(సమాసాశ్రయ విధి ప్రకరనము06-03-130) మిత్రే చ ఋషౌ అని విడదీసుకోవాలి. మిత్ర శబ్దము ఉత్తర పదమయినప్పుడు (రెండవ పదమయినప్పుడు) విశ్వ శబ్దానికి దీర్ఘము వస్తుందని ఈ సూత్రము యొక్క అర్థం. అందుకే విశ్వామిత్ర అవుతుంది . విశ్వమిత్ర కాదు. విశ్వామిత్ర అంటే విశ్వానికి మిత్రుడని అర్థం .

విశ్వం ఎవరికి మిత్రమో అతడు విశ్వామిత్రుడు అని వేదోక్తి( తస్య విశ్వం మిత్రం ఆసీత్ , యదిదమ్ తస్మాత్ విశ్వామిత్రః ). స్వస్తి.

04

మన్దానిలో౽సౌ మలయానిలో౽సౌ

గన్ధానిలో౽సావితి యం యువానః

సంభావయన్తే చలితైః శిరోభిః

స కో౽పి యత్కోణభావః సమీరః

తాత్పర్యము

 “ఆహా ! ఇది పిల్లగాలి!  ఇది కమ్మగాడ్పు. ఇది దక్షిణానిలము.  ఇది చందనపు చెట్ల మీద నుండి వచ్చే గాలి అని” యువక జనులు  తలలు ఆడించి గౌరవించు మలయ మారుతము ఆ పాండ్య నగరపు సందుగొందులలో వీస్తుంటుంది.

1.సమీరమంటే సమ్యక్ ఈరతి గచ్ఛతి ఇతి సమీరః లెస్సగా సంచరించే వాడు సమీరుడు.

05

ఆకారితా యత్ర మఖేషు విప్రై

రాలోకయన్తౌ విబుధాః సమృద్ధిమ్

యుష్మాన్యజామో వయమర్పయధ్వే

యుష్మత్పదం చేదితి సాన్త్వయన్తే

తాత్పర్యము

ఆ మధురా నగరములో విప్రులు యజ్ఞములు చేసేటప్పుడు హవ్యభాగములను(దేవతలకీదగినయన్నము.)తీసుకొనుటకు దేవతలను పిలిచినప్పుడు ఆ విప్రుల సంపదలను చూచి మీ పదములను మాకు ఇస్తే పూజ చేసుకొని తరిస్తాముఅని దేవతలు విప్రులను బతిమాలుచుందురు.( దేవతల కన్నా విప్రుల సమృద్ధి గొప్పదని భావం)

విశేషాలు

1. యజ్ఞం = యాగం, వేలిమి;

2. యజనం = యజ్ఞం చేయటం;పూజించు

3. యాజన = యజ్ఞం చేయించటం;

4. యాజకుడు, యాజ్ఞికుడు = యజ్ఞం చేయించే వ్యక్తి;

5. యజ్వ = యజ్ఞం చేసినవాడు;

6. పూజించు అను అర్థంకలపదాలు అనేకమున్నప్పటికి (అభ్యర్చించు, అర్చించు, ఆరాధించు, ఉపాసించు, కొలుచు, కైసేయు, పరిచరించు, పురస్కరించు, భూషించు, యజించు) . యజ్ఞసంబంధమైన యజించు పదాన్ని ఎన్నుకోవటంలో దీక్షితులవారి ప్రతిభ ఉంది.

7. మఖన్తి దేవా అత్రేతి మఖః మఖి గతౌ- దేవతలు వస్తారు కనుక యజ్ఞానికి మరో పేరు మఖము.మఖ పదము కూడా సందర్భానుగుణమైన పద ప్రయోగము.

06

తపోవనే౽న్యత్ర తపశ్చరన్తో

దివం భజన్తే యది యుక్తమేతత్

తతో౽ధికే యత్ర తపస్యతాం హి

తత్రైవ యుక్తః సుచిరం నివాసః

తాత్పర్యము

తపస్సు ఎక్కడ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందో అక్కడే చేయాలి. సాధారణంగా, కొండలు, తపోవనములలో  తపస్సు చేసేవారు స్వర్గాన్ని పొందుతారని చెబుతారు.  కానీ, శివుని అనుగ్రహం లభించే స్వర్గంతో సమానమయిన  పాండ్య నగరంలాంటి ప్రదేశంలో తపస్సు చేస్తే  ఇంకా శ్రేష్ఠమైన ఫలితాన్ని పొందవచ్చు. అందుకే,చాలామంది తపస్వులు పాండ్య నగరంలో నివాసము ఏర్పర్చుకొన్నారు.

విశేషాలు

తపస్సు

తపంత్యత్రేతి తపఃతాపశ్చ- తప సంతాపే. దీనియందు తపింతురు.

ద్వాదశ-తపస్సులు

1. ఉపవాసము, 2. అరకడుపుగ భుజించుట, 3. వృత్తి పరిసంఖ్యానము (భిక్షకై గృహముల నేర్పఱచుకొనుట), 4. రస పరిత్యాగము (షడ్రసములను లేక 1,2 రసములను వదలుట), 5. వివిక్త శయ్యాసనము (ఏకాంత స్థానమున పడుకొనుట, ఉండుట), 6. కాయక్లేశము, 7. ప్రాయశ్చిత్తము, 8. వినయము (రత్నత్రయము, దానిని ధరించువారిపై వినయమును చూపుట), 9. వైయావృత్తము (గురుముని పాదసేవ), 10. స్వాధ్యాయము, 11. వ్యుత్యర్గము (శరీరముపై కల మమతను తక్కువ చేసికొనుట), 12. ధ్యానము చేయుట [ఇవి జైనాచార్యుల తపస్సులు]. [జైనధర్మపరిభాష]

07

మృత్పిణ్డ రూపో జనకో యదీయః

పితామహో యస్య కులాల ఏవ

స కుమ్భజన్మాజని సూత్రకారః

కోణే వసన్క్వాపిచిరం యదీయే

తాత్పర్యము

తండ్రిగారు  కుండ. తాతగారు కులాలుడు. ( కుమ్మరి)  అటువంటి కుంభజుడు ( కుండలో జన్మించిన అగస్త్యుడు) ఈ పాండ్య నగరములో ఒక మూల నివాసముండి  సూత్రకారత్వసిద్ధిని(సూత్రములు కలిగిన  వ్యాకరణాన్ని రచించిన సిద్ధి)  పొందాడు.

విశేషాలు

1. మిత్రుడనగా సూర్యుడు. వరుణుడు అనగా ప డమటి దిక్కునకు అధిపతి, నీటిరేడు. దేవతా వాచకపదముల ద్వంద్వసమాసమున బూర్వపదము తుదియచ్చునకు దీర్ఘము కలుగును కనుక వీరిద్దరిని కలిపితే మిత్రావరుణులు

2. ఆ మిత్రావరుణులు సముద్రపుగట్టున సంచరించుచుండగా ఊర్వశిని చూచి కామించారు. వారి తేజస్సులు ఒక కుండలో ఉంచగా అందు అగస్త్యవసిష్ఠులు పుట్టారు.కనుక కుంభ జన్ములు అగస్త్యవసిష్ఠులు

3. ఇందులో అగస్త్యుని కవి కుంభ జన్మునిగా ఈ శ్లోకంలో పేర్కొన్నాడు

4. తమిళ వ్యాకరణాన్ని అగస్త్యం అంటారు. కనుక అగస్త్యుడు పాణిని మహర్షిలా సూత్రకారుడని కవి చమత్కారం..

5. అగస్త్యునికి జనకుడు మట్టి కుండ రూపంలో ఉన్నాడని, తాత మట్టి కొరకు భూమిని మర్దించు కులాలుడని (కుమ్మరవానిని) చెప్పుటలో దీక్షితుల వారు వ్యంగ్యమార్గ ధోరణిని అనుసరించారు.  

6. మృత్పిండము మీద ఒక అమోఘమైన వ్యాఖ్యానం చిత్తగించండి.

ప్రతిఒక్కటీ ప్రపంచంలో స్వతస్సిద్ధం కాదు. ఏదో ఒక మూలపదార్ధం నుంచి ఏర్పడిందే. అలా ఏర్పడిందంటే అది కార్యం. కార్యమనేసరికి దానికాది ఒకటీ అంతమొకటీ ఉండక తప్పదు. అంటే జన్మ, వినాశమూ అని అర్ధం. జన్మించిందంటే అంతకు ముందేమిటది ? ఎలా ఉంది ? ఈ కనిపించే రూపంలో లేదది. అలాగే నశించిన తరువాత కూడా ఈ రూపంలో కానరాదు. ఉదాహరణకొక ఘటాన్నే తీసుకొని చూడు. కుమ్మరి తయారుచేయక ముందది ఎక్కడిది ? అప్పుడున్నది మృత్తికే గాని ఘటంకాదు. అలాగే అది బ్రద్దలైన తరువాత కూడా ఉన్నదక్కడ మృత్తికే, ఘటం లేదు. కాబట్టి ఇప్పుడు మనకండ్లకు ఘటంగా కనిపించే పదార్ధం ఈ రూపంలో ఆ రెండు దశలలోనూ లేదని అర్ధమయింది. అంటే ఆ రూపానికి నిలకడలేదనే గదా అర్థం.

8. ఉన్నట్టు మనం చూస్తున్నామే అని అడిగితే అది కేవలం మన భ్రమ అన్నారు భగవత్పాదులు. మనమున్నట్లు చూస్తున్నది నిజంలో అక్కడ లేదు. ఫలానా అని దాన్ని పట్టుకొనే సరికే అది తప్పించుకొని పారిపోతుంది. ఇంతెందుకు, ఒక ఘటాన్నే తీసుకొని చూడు. దూరానికొక గుండ్రని ఆకారంలో మనకది గోచరిస్తున్నది. అలా గోచరించటం కేవల మాపాతరమణీయమే. దగ్గరికి వెళ్ళి చూడబోతే అదంతా మృత్తికేగాని కుండగాదు. అంటే కుండ అనే రూపం తప్పించుకొని పారిపోయింది. దాని స్థానంలో ఉన్నదప్పుడేమిటి? మృత్తిక అనే మూలపదార్ధమే. పోనీ అదైనా నిలకడగా ఉన్నదా అంటే లేదు. దాన్ని తడవిచూస్తే అదంతా కేవలం పృథివీరేణువులే. ఆ రేణువుల పరస్పర సంశ్లేషం వల్లనే అది ఒక మృత్పిండ రూపంలో కనిపిస్తున్నది. ఆ రేణువులైనా అక్కడికి నిలుస్తాయా అని చూస్తే ఘనంగా కనపడే ఆ అణువు లొకానొకప్పుడు ద్రవరూపంగా ఉన్న జలపరమాణువులే. అవి అంతకుముందు తేజః పరమాణువులే. ఆతేజః పరిమాణువు లతః పూర్వం స్పందరూపమైన వాయుతత్త్వమే. ఆ వాయువు కూడా అంతకు మునుపు కేవల మస్పందరూపమై సర్వవ్యాపకమైన ఆకాశతత్త్వం. కాబట్టి ఏదీ ఒకేరూపం కాదు. (శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి వ్యాఖ్యానం నిర్వాణ దశకమునకు)

08

సౌభాగ్యలక్ష్మీం నవచందనానాం

మందానిలానామపి మౌక్తికానామ్

ఆయాతయామామభినిర్విశన్తి

ప్రాయేణ కౌమారహరా యదీయాః

ఆ నగరంలో ఉన్న యౌవన వంతులుతరచుగా మృదువైన గాలులు, ముత్యాల చందనాల మహిమను ఆస్వాదిస్తూ,అత్యంత ప్రకాశమానమైన సౌభాగ్య లక్ష్మిని అనుభవిస్తారు,తదనంతరం దానిని నిత్యం త్యజిస్తారు.

విశేషాలు

చందనము(గంధము.)

ఇది Santalaceae అను కుటుంబమునకు చెందిన Santalum album అను మొక్క యొక్క కఱ్ఱ (Sandal wood). ముదిరిన కఱ్ఱ నుండి చందన తైలమును తీయుదురు.)

.అష్టవిధ-మౌక్తికములు

ముత్తెములు ఏనుఁగు కుంభస్థలము, మేఘము, పందికోఱ, శంఖము, మత్స్యశిరము, పాఁపపడగ, ముత్తెపుచిప్ప, చెఱకు, బొంగువెదురు వీనియందు పుట్టును. ముత్తెపుచిప్పయందు పుట్టినవే తఱచుగా వాడఁబడును.

కౌమార హరాః

పదియాఱేండ్లు మొదలు ముప్పదియేండ్లవఱకుగల వయసుగలవారిని పరువము హరిస్తుందని కవి నూతన భావన. దొంగిలించిన వస్తువుపై దొంగతనము చేసినవారికే కదా అధికారం.యౌవనం యువకులను దొంగిలించింది అనగా వారిని యౌవనము ఆ డిస్తోందని అర్థం.లేదా యౌవనాన్ని హరించిన యువకులు అని కూడా చెప్పుకోవచ్చు. స్వస్తి.

09

యత్రోభయానుచ్చతరాన్రసాలా-

నాలక్ష్య విన్ధ్యస్మయభఙ్గదక్షాన్

తపస్యతి న్యస్తభరః సుఖేన

తేష్వేవ మైత్రావరుణిర్మహర్షిః

తాత్పర్యము

ఆ మధురా నగరములో పొడవైన రెండు తియ్య మామిడి చెట్లున్నాయి. వాటిని చూసి వింధ్య పర్వతము యొక్క గర్వమును పోగొట్టటానికి తాను అక్కర్లేదని తలచి, ఆ గర్వ హనన కార్యక్రమము ఆచెట్ల మీద ఉంచి సుఖముగా అగస్త్యుడు తపస్సు చేసుకొంటాడు.( తియ్య మామిడి చెట్లు వింధ్య పర్వతముకంటె పొడవుగా ఉన్నాయని భావం)

విశేషాలు

ఒకప్పుడు మేరువింధ్య పర్వతములకు ఒక నిమిత్తము వివాదము కలిగి వింధ్యపర్వతము సూర్యచంద్రగతులకు అడ్డముగ పొడవెదుగ లోకమునకు అలజడి పొడమ అది తెలిసి దేవర్షులు అగస్త్యునిచెంతకు పోయి పొడమిన విపత్తును విచారింపుడని వేడగా అమ్మహామహుడు బయలువెడలి తన శిష్యుఁడగు వింధ్యముకడకు రాగా ఆపర్వతశ్రేష్ఠుడు అగస్త్యునకు దండప్రణామము ఒనర్చుటకు నేలమట్టమయ్యెను.

అప్పుడు అగస్త్యుడు వింధ్యునిం గని నేను దక్షిణమునకు పోయి మరలి వచ్చుదనుక నీవిచ్చట ఈప్రకారమే ఉండుమని పలికి పోయెను. వింధ్యము అది మొదలు ఇదివఱకును ఆ ప్రకారముననే క్రింద పడి ఉన్నదని ప్రసిద్ధి (పురాణనామచంద్రిక)

ఈ కథపై దీక్షితులవారు అల్లిన అందమైన ఊహ ఇది.

10

ఉపత్యకామణ్డలనిర్విశేషే

దేశే హి యస్మిన్ మలయాచలస్య

ఉదేతి మన్దం వ్యజనానిలో౽పి

చమత్కృతశ్చన్దన సౌరభేణ

తాత్పర్యము

మలయపర్వతమంటే గందపు పర్వతము. సువాసనల నిలయము. దక్షిణాన ఉన్న మధురా నగరము కూడా ఆకొండ కింద నేల కనుక , ఆదేశములో ఎవరన్నా వినకర్రతో విసురుకొంటే, సువాసనలు కదులుతుంటాయి.

విశేషాలు

1. యస్మిన్

యస్మిన్ జీవతి జీవంతి బహవః స తు జీవతి ఎక్కువమంది జీవించటానికి సహాయపడుతూ, ఎవడు జీవనాన్ని కొనసాగిస్తాడో వాడు మాత్రమే బతికినట్లు, అతని జీవితమే సఫలము .

2. ఉదేతికి కాళిదాసు మనోహర ప్రయోగము

ఉదేతి పూర్వం కుసుమం తతః ఫలం ఘనోదయః ప్రాక్తదనన్తరం పయః ।నిమిత్తనైమిత్తికయోరయం క్రమస్తవ ప్రసాదస్య పురస్తు సమ్పదః (అభిజ్ఞాన శాకుంతలము 07-30)

11

పదే పదే చన్దనకాననస్థైః

ఫణాధరైర్యత్ర నిపీయమానః

జాతః ప్రభూతో౽పి బహిః ప్రసర్ప

న్మన్దః కిలైవం మలయానిలో౽భూత్

తాత్పర్యము

ఈ శ్లోకం మలయపర్వతపు గాలికి ఉన్న ప్రత్యేకతను వివరిస్తోంది.
సాధారణంగా, చందనపు వృక్షాలతో కూడిన మలయపర్వతం నుంచి వచ్చే గాలి ఎంతో సుగంధభరితమైనదిగా ఉంటుంది.
కానీ, ఆ ప్రాంతంలో నివసించే పాములు పదేపదే ఆ గాలిని పీల్చడంతో, అది బయటకు ఉగ్రంగా కాక, మందంగా వ్యాపిస్తోంది.అందుకే ఆ గాలికి మంద మారుతము ( నెమ్మదిగా వీచు గాలి) అను పేరు వచ్చింది.

విశేషాలు

1. మలయ పర్వతము మీద నుంచి వచ్చే గాలి మనస్సులకు ఆహ్లాదము కలిగిస్తుందని కవుల వర్ణన.అది మంద మారుతము ఎందుకయిందో దీక్షితులవారు ఇందులో చమత్కరించారు.

2. చందనగంధన్యాయం :

గంధపుచెక్కను ఎంత అరుగదీసినా దాని వాసన ఎక్కువతుందే కాని తగ్గదన్నట్లు. [సజ్జనునికి కష్టాలు వచ్చినకొద్దీ అతని గుణాతిశయం బయట పడుతుంది.]

3. చందనన్యాయము (చందనగంధము చందమున).

"యథా హరిచందనబిందు శ్శరీరైకదేశసంబద్ధోఽపి సన్ సకలదేహవ్యాపిన మాహ్లాదం కరో త్యేవ మాత్మాపి దేహైకదేశస్థః సకలదేహవ్యాపినీ ముపలబ్ధిం కరిష్యతి" (మంచిగంధపుబిందువొకటి శరీరములో ఏ భాగములో ఉన్నా మొత్తం శరీరానికి ఆహ్లాదము కలుగుతుంది.అలాగే శరీరములో ఆత్మ ఒకచోట ఉన్నా మొత్తం శరీరానికి సంబంధించి ప్రవర్తిస్తుంది.)

4.. హాలాహలో నైవ విషం విషం రమా

జనా: పరం వ్యత్యయ మత్ర మన్వతే

నిపీయ జాగర్తి సుఖేన తం శివ:

స్పృశన్నిమాం ముహ్యతి నిద్రయా హరి(చాటుశ్లోకం)

విషం తాగిన శివుడు, ఏ బాధ లేకుండా హాయిగా, సుఖంగా మేల్కొని ఉన్నాడు.కాని అసలు విషం అయిన లక్ష్మిని (సంపదను) తాకిన విష్ణువు మాత్రం పాన్పుపై ఎప్పుడూ నిద్రలో (సంపద వలన వచ్చిన మత్తులో) ఉన్నాడు. కనుక అసలు విషం సంపద.

12

మన్దానిలం మన్మథమూలకన్దం

యత్రోపయోక్తుం మునయస్త్రసన్తః

వైయాఘ్రచర్మవ్యజనోపజాతై

ర్వాతైర్వ్రతం కేచన వర్తయన్తే

తాత్పర్యము

మన్మథ భావనలను రేకెత్తించు చిరుగాలి వీచుచుండగా , భయపడిన మునులు పులితోలుతో కూడిన వినన కర్రలను విసురుకొంటూ వాటి నుండి పుట్టే గాలులతో కూడిన వ్రతమును చేయుచున్నారు.

విశేషాలు

1. పులితోలుతో కూడిన వినన కర్రలనుటలో దీక్షితులవారి చమత్కారమున్నది.

2. వర్తయన్తేకు విశిష్ట ప్రయోగ శ్లోకం

మదసిక్తముఖైర్మృగాధిపః కరిభిర్వర్తయతే స్వయంహతైః

లఘయన్ఖలు తేజసా జగన్న మహానిచ్ఛతి భూతిమన్యతః ||(కిరాతార్జునీయము 02-18)

(స్వయముగా తాను చంపిన మదజలము చేత తడిసిన ముఖములు కలిగిన ఏనుగులచేత మృగరాజైన సింహము జీవిస్తుంది. తన తేజస్సుచేత ప్రపంచమునే చిన్నదిగా చేయగల గొప్పవాడు ఇంకొక వ్యక్తి నుండి సంపదను కోరుకొనడు.)

13

అయత్నలభ్యం రథమద్భుతాని

శరాసకాణ్డాని శరానసఙ్ఖ్యాన్

యత్రైవ పశ్యఞ్జగదేక వీరః

స్థిరం మనోజః శిబిరం చకార

తాత్పర్యము

ప్రపంచము మొత్తములోనూ ముఖ్య వీరుడయిన మన్మథునికి ఆ మధురా నగరములో ప్రయత్నము ఏమీలేకుండా రథము ( మలయపవనం) లభించింది. ఆశ్చర్యకరములైన ధనుస్సుల సమూహములు లభించాయి( చెరకు మధురా నగరంలో ఎక్కువ. అందుకే మన్మథుని ధనుస్సులయిన చెరకు విల్లుల సమూహాలు బాగా లభించాయని భావం) ఆ మధురా నగరములో అనేక పూలతోటలు ఉన్నాయి. ఇక తన పూల బాణాలకు తిరుగులేదని సంతోషముతో మధురానగరములో స్థిరమైన శిబిరాన్ని మన్మథుడు చేసుకొన్నాడు.

ఆ మధురలో చల్లనిగాలి, చెరకు , పూలతోటల మనోహరమయిన వాతావరణం ఉందని చెప్పటానికి కవిగారి అందమైన ఊహ ఇది.

విశేషాలు

1. మన్మథుని రథం

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః

వసంతస్సామంతో మలయ మరుదాయోధన రథః

తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం

అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే.(శంకరుల సౌందర్య లహరి 06 )

2. ఇందులో మలయ మరుదాయోధన రథఃసమాస ఘటన దీక్షితుల వారి రథ పదాన్ని వివరిస్తుంది.

3. మలయ పర్వతాల నుండి వచ్చే మంచిగంధపు వాసనలున్న చల్లటి గాలులను మన్మథుడు తన యుద్ధం కోసం ఏర్పడిన రథముగా చేసుకొన్నాడు. అని శంకర భగవత్పాదులవారు చెప్పారు. ఆ రథము ( మలయ పవనాలు) మధురానగరములో మన్మథునికిఅప్రయత్నంగా దొరికిందని దీక్షితులు చమత్కరించారు.

4. బృహస్పతిరథము నీతిఘోషము, అర్జునునిరథము నందిఘోషము, విష్ణురథము శతానందము.

5. చకారకు విశిష్ట ప్రయోగాలు

చకార కామః ప్రమదాజనానామ్. (ఋతుసంహారం కాళిదాసు)

చకార సురసా చాస్యం. వింశ ద్యోజనమాయతమ్( వాల్మీకి సుందరకాండ)

6. మన్మథుడు

మన్మథుడువిష్ణువుయొక్క మానసపుత్రుడు. లక్ష్మికి పుట్టినట్లును చెప్పుదురు. ఇతఁడు రతి పతి. మీనకేతుడు. మకరధ్వజుడు. పుష్పధన్వుడు. మంచిరూపము కలవాఁడు ఇతడు రుద్రునకు కామవికారము కలుగఁజేసి అతని రౌద్రదృష్టిచే అనంగత్వమును పొంది అనంగుఁడు అను పేరుపొందెను.ఈతని బాణములు మోదనము, ఉన్మాదనము, సంతాపనము, శోషణము, నిశ్చేష్టాకరణము అనునవి. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము అనునవి అయిదు మన్మథుని బాణములు అనియు అందురు. ఇతడు విష్ణుపుత్రుఁడు ఐనందున బ్రహ్మకు తమ్ముడు అవును. ఇతనికి స్మరుడు, అంగజుడు, శంబరారి మొదలగు నామములు అనేకములు కలవు.(పురాణనామచంద్రిక ) స్వస్తి.

14

తామ్రాతరఙ్గానిలతాడితాసు

మకరన్దవాటీషు మనోజవీరే

యత్రావతీర్ణే మహతా బలేన

తద్బాహుగుప్తాస్తరుణా రమన్తే

తాత్పర్యము

తామ్రపర్ణీనది పై నుండి వీచు గాలులతో కలియు పూలతేనెలు కురియు తోటలందు మన్మథుడనే మహారాజు మహాబలములతో కొలువై ఉన్నాడు. ( మన్మథ ప్రభావము ఆతోటలో ఎక్కువ అని భావం) ఆ మధురా నగరపు తోటలలో యువకులు సుఖము పొందుతుంటారు.

విశేషాలు

1. 'తామ్రపర్ణి' ... అంటే 'రాగి ఆకు' అని అర్థం. ఈ నదిలోని ఇసుక ..నీరు రాగి రంగులో ఉంటాయి. నదీ తీరంలో రాగి రంగు ఆకులు గల వృక్షాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఈ కారణంగానే ఈ నదికి 'తామ్రపర్ణి' అనే పేరు వచ్చినట్టు చెబుతారు.

2. విశిష్ట గుణాలు కలిగిన శంఖాలను ... అరుదైన ముత్యాలను అందించడం ఈ నది ప్రత్యేకత.

3. రాగి రంగులో అందంగా కనిపిస్తూ ఆహ్లాదపరిచే ఈ నది, అగస్త్య పర్వతంలో పుట్టి తమిళనాడు - తిరునల్వేలి జిల్లా మీదుగా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది.(అంతర్జాల సౌజన్యం)

4. తామ్రపర్ణ్యమలపాథః కేళిహంసంబు (తామ్రపర్ణి నదిలో విహరించే హంస) అని ఆముక్తమాల్యదలో మత్స్యధ్వజుని రాయల వారు వర్ణించారు.

15

వర్షోపలా యత్ర హి మౌక్తికాని

కాష్ఠాని గన్ధద్రుమకాణ్డఖణ్డాః

కస్తేన విస్పర్ధితుముత్సహేత

దేశః శిలాకణ్టకపూరితో౽న్యః

తాత్పర్యము

పాండ్య దేశములో వడగల్లు ముత్యములుగా మారుతుంటాయి.

గంధపు చెట్లయొక్క బోదెల తునుకలు వంట చెరకులుగా మారుతుంటాయి.

అట్టి పాండ్య దేశముతో సూదిమొనలవంటి రాళ్లతో నిండిన,వేరొక దేశమెట్లు పోటీ పడగలదు? ( పాండ్యదేశము అన్ని దేశాల కంటె గొప్పదని భావం)

విశేషాలు

1. పాండ్యదేశము

చోలరాజ్యమునకు దక్షిణమున కన్యాకుమారివఱకు కల దేశము. దీనిని పాండ్యుడు నిర్మించాడు కనుక పాండ్యదేశము అని పేరు . దీనికి రాజధాని మధుర.

2. 11రకాల రత్నాలలో ఈ ఉపలక మణి పేర్కొనబడుట విశేషం.

1మాణిక్యము, 2. ముత్యము, 3. ప్రవాళము, 4. మరకతము, 5. పుష్యరాగము, 6. వజ్రము, 7. ఇంద్రనీలము, 8. మేదకము, 9. సూత్రమణి, 10. వైడూర్యము, 11. చంద్రకాంతము, 12. ఘృతమణి, 13. తైలమణి, 14. భీష్మకమణి, 15. అమృతమణి, 16. ఉపలకమణి, 17. వారసమణి, 18. ఉలూకామణి, 19. లాజావర్తము, 20. మాసరమణి, 21. భీష్మక పాషాణము. [రత్నదీపిక]

3. ఉత్సహేతకు భాగవతంలోని భ్రమరగీతలలో ఒక మనోహర ప్రయోగం

క ఉత్సహేత సన్త్యక్తుముత్తమఃశ్లోకసంవిదమ్ ।

అనిచ్ఛతోఽపి యస్య శ్రీరఙ్గాన్న చ్యవతే క్వచిత్ ॥(దశ. 47అధ్యా.48వశ్లో)

( ఉత్తమశ్లోకుని విడిచిపుచ్చుటకు ఎవడు ఉత్సాహము చూపిస్తారు? శ్రీ కృష్ణుడు కోరకున్నను, లక్ష్మి అతని అంగసంగాన్ని ఎప్పుడూ విడిచిఉండదు.) స్వస్తి.

16

ఇంద్రవజ్రము

స్వర్గం నవం స్రష్టుమనా మునిః ప్రా

క్ససర్జ యత్సంముఖదేశ ఏవ

తన్మారుతస్పన్దనమాత్రతో౽పి

స్వర్భోగ భాగ్యం సులభం విజానన్

“ఈ పాండ్య దేశపు గాలి సోకినమాత్రముచే స్వర్గ భాగ్య భోగ్యము సులభము “ అను  ఊ కలిగింది కాబట్టే ఈ పాండ్య దేశము దగ్గరే  అ విశ్వామిత్రుడు నూతనస్వర్గసృష్టి చేయాలనుకొన్నాడు.

17

అన్యా విశన్యః సరితః సముద్ర

మాపూరయన్తే జలజన్తుభిః స్వైః

రత్నాపగా యత్ర తు సంపతన్తీ

రత్నాకరత్వం రమణస్య దత్తే

 

 

అన్యసదు లయ్యపాంపతి ననుగమించి యాదసాంపతి యనుబీరు దతని కొసఁగ నిచటిరత్నా పగయు దానె యెలమిఁ గలిసి రమణున కొసంగు రత్నాకరత్వసిద్ధి.

సముద్రములో మిగతా నదులు కలిసి సముద్రమును  యాదసాం పతిని(జలజంతువుల పతి) చేస్తున్నాయి. .

కాని రత్నాపగయైన వేగై నది సముద్రములో కలుస్తూ రత్నములను కలుపుతూ సముద్రుని రత్నాకరుని చేయుచున్నది.( సముద్రమునకు వేగై నది వలన రత్నముల గని అని పేరు వచ్చినదని నదికి ప్రశంస.)

విశేషాలు

1. సముద్రము

చంద్రోదయము వలన వృద్ధి పొందునది(సమ్యగునక్తి చంద్రోదయాత్ ఉదీక్లేదనే)

సమంతాన్ముదం రాతీతి వా సముద్రః- (రా దానే) అంతటా సంతోషమును ఇచ్చునది

ముద్రయా సహితస్సముద్రః- ఈశ్వరాజ్ఞతో కూడుకొని యుండునది;

2. సరిత్

సరతీతి సరిత్ సృగతౌ - ప్రవహించునది

3. రత్నాకరః

రత్నానామాకరః రత్నాకరః- రత్నములకు గని

4. వైగై

శృంగారం వాగైనది ఆ వాగే వైగై నది,( వేటూరి)

5. మదురైలోని 'వైగై'నది ఎంతో ప్రత్యేకతను ... మరెంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇది పవిత్రమైన నదిగా ... పాపాలను కడిగేసే పుణ్యనదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ నదిని ప్రవహింపజేసినది సాక్షాత్తు సదాశివుడని స్థలపురాణం చెబుతోంది. అమ్మవారు మీనాక్షిగా అవతరించగా ... సుందరేశ్వరుడు పేరుతో ఆదిదేవుడు ఆమె మనసును గెలుచుకుంటాడు. వారి ప్రేమ పరిణయానికి దారితీస్తుంది.

6. వివాహానికి సుందరేశ్వరుడు తన తరఫున 'గంధోదరుడు' అనే మరుగుజ్జును మాత్రమే తీసుకుని వస్తాడు. ఆయనకి బలగంలేదనే ఉద్దేశ్యం ధ్వనించేలా ... తాము చేసిన వంటకాలన్నీ మిగిలిపోతాయంటూ మీనాక్షీదేవి నిరాశా నిస్పృహులను వ్యక్తం చేస్తుంది. అతను ఆరగించగా మిగిలితే మిగతా వారిని తీసుకుని వస్తానని చెబుతాడు సుందరేశ్వరుడు. ఆయన అన్నట్టుగానే ఉన్నవన్నీ వడ్డించినా ... అప్పటికప్పుడు వండించినా గంధోదరుడు ఆకలిగానీ ... దాహంగాని తీరవు.

అతిథిని సంతృప్తి పరచలేని దోషం అంటుతుందని మీనాక్షీదేవి తల్లిదండ్రులు సుందరేశ్వరుడి దగ్గర ఆవేదనని వ్యక్తం చేస్తారు. గంధోదరుడి ఆకలి తీర్చడానికే ఆందోళన చెందిన వాళ్లు, ఇక సుందరేశ్వరుడి శక్తి అసమానమైనదని అంగీకరిస్తారు. దాంతో శివుడు అన్నపూర్ణమ్మ తల్లినీ ... గంగాదేవిని పిలిచి గంధోదరుడి ఆకలినీ ... దాహాన్ని తీరుస్తాడు. అలా శివుడి ఆదేశం మేరకు వచ్చిన గంగాదేవి ... నేడు 'వైగై' పేరుతో ఇక్కడ ప్రవహిస్తూ వుంది.(అంతర్జాల సౌజన్యం)

7.అన్యా

ఈ శ్లోకములోని అన్యాపదము ఒకానొక శృంగార నాయికను( పరకీయ)స్మరింపచేయుచున్నది. కావ్య సంప్రదాయము ప్రకారము సముద్రుడు నాయకుడు, నదులు నాయికలు కదా!

 

18

యత్సఙ్గమాదేవ భవన్తి ముక్తాః

సా జాహ్నవీ సర్వజనీనమేతత్

తతో విదుర్దక్షిణజాహ్నవీతి

తాదృగ్విధాం యత్ర హి తామ్ర పర్ణీమ్

తాత్పర్యము

దేనిలో మునుగుట వలన సర్వజనులకు ముక్తి కలుగునో, ఆ పవిత్రమైన జాహ్నవీనది (గంగానది) తామ్రపర్ణి అను పేరుతో మధురై నగరములో ప్రవహించి పేరు పొందుచున్నది. దక్షిణ జాహ్నవి అని ఇక్కడ  పవిత్రముగా పిలుచుకొంటుంటారు.

విశేషాలు

1. ముక్తులు

శరీరేంద్రియముల వలన ఆత్మ విడువబడుట ముక్తి. ఆత్మను సంసార బంధమునుండి విడిపించునది అని కూడ ముక్తికి ఇంకో అర్థం

2. మూడు రకాల ముక్తులు

క్రయముక్తి, 2. జీవన్ముక్తి, 3. విదేహముక్తి.

3. నాలుగు రకాల ముక్తులు

సాలోక్యము (విష్ణులోకమందుండుట), 2. సామీప్యము (విష్ణువు దగ్గఱనుండుట), 3. సారూప్యము (విష్ణురూపుడై యుండుట), 4. సాయుజ్యము (విష్ణువులో జేరియుండుట).

4. జాహ్నవి

గంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపగా అతడు కోపించి దానిని పానముచేసి, పిమ్మట భగీరథుడు ప్రార్థింపగా ప్రసన్నుడై తన చెవినుండి వెడల విడిచెను. ఇందువలన గంగకు జాహ్నవి అను పేరు కలిగెను.

5. 'తామ్రపర్ణి' ... అంటే 'రాగి ఆకు' అని అర్థం. ఈ నదిలోని ఇసుక ..నీరు రాగి రంగులో ఉంటాయి. నదీ తీరంలో రాగి రంగు ఆకులు గల వృక్షాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఈ కారణంగానే ఈ నదికి 'తామ్రపర్ణి' అనే పేరు వచ్చినట్టు చెబుతారు.

6. విశిష్ట గుణాలు కలిగిన శంఖాలను ... అరుదైన ముత్యాలను అందించడం ఈ నది ప్రత్యేకత.

7. రాగి రంగులో అందంగా కనిపిస్తూ ఆహ్లాదపరిచే ఈ నది, అగస్త్య పర్వతంలో పుట్టి తమిళనాడు - తిరునల్వేలి జిల్లా మీదుగా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది.(అంతర్జాల సౌజన్యం)

19

దత్తే సుతాం స్వామివ యాం సమస్తై

రలంకృతాం రత్నగణైరగస్త్యః

సరస్వతే గోత్రమహత్తరాయ

యతో గృహీతా హరిణాపి వేదాః

 

తాత్పర్యము

హరికి  వేదములను  ఇచ్చిన  గోత్రమహత్తరుడయిన( గొప్ప పర్వతములు కలిగిన,గోత్రము కలిగిన) సముద్రునికి , అఖిల రత్నసమూహములచే అలంకరించబడిన ఆ తామ్రపర్ణి నదినిసొంత కుమార్తెను దానము చేయు రీతిగా    వింధ్య పర్వతమును స్తంభింపచేసిన అగస్త్యుడు సమర్పించెను. (అగస్త్యునికి కుమార్తె వంటిది ఆ తామ్రపర్ణి నది.)

విశేషాలు

అఖిల రత్నసమూహములచే ఆ నదీమతల్లి అలంకరించబడినదనగా- ఆ నదిలో రత్నాలు దొరకునని అతిశయోక్తి.

20

అభ్యాపతన్తీమనువాసరం యా

మగస్త్యగోత్రప్రభవేతి సిన్ధుః

వికీర్య పుష్పైరివ మౌక్తికౌఘైః

ప్రత్యుద్గజన్ప్రాపయతే కిమన్తః

తాత్పర్యము

తామపర్ణి నది అగస్త్యగోత్రోద్భవ.అందుకే ప్రతిరోజూ తనదగ్గరకు వచ్చు ఆ తామ్రపర్ణి నదిని అగస్త్యగోత్రోద్భవగా భావించి,  సముద్రుడు ప్రతిరోజూ ఎదురేగి ముత్యాల పూలతో స్వాగతము పలికి తన అంతః పురములోపలికి తీసుకొనిపోతాడు..

విశేషాలు

అభి :

ఈ ఉపసర్గ సమాసమున పూర్వ పదముగా నుండి ఈ క్రింది అర్థములను తెలుపును.

1. ఎదురు (అభిముఖము).

2. దగ్గఱ (అభ్యాగతము).

3. అంతటను (అభిచరించు).

4. మిక్కిలి (అభిరుచి).

అర్థవిశేషము లేకుండగనే కొన్నియెడల ప్రయుక్తమగును.

అభ్యనుజ్ఞ మొ॥ ప్రస్తుత శ్లోకములోనూ ఆ విధముగానే(అభ్యాపతన్తీమ్) ప్రయోగింపబడినదని తోచుచున్నది

21

స్రోతోముఖైః రమ్బునిధిం ప్రవిష్టం

స్వభావతః స్వాదు యదీయమమ్భః

నిర్మథ్య లబ్ధం త్రిదశైః కదాచి

దాస్వాద్యతే౽ద్యాపి సుధా సుధేతి

 

తాత్పర్యము

తామ్రపర్ణి నదీ జలములు సముద్రములో కలుస్తుంటాయి. తామ్రపర్ణి నదిలోని నీరు కలియుటవలన సముద్రపు నీరుకు అమృతగుణము, మధురత్వము అబ్బాయి. అలా తామ్రపర్ణి నది లోని నీరు కలిసిన సముద్రాన్ని మథించి దేవతలు అమృతమని అప్పటికి, ఇప్పటికి అస్వాదిస్తుంటారు. ( తామ్రపర్ణి నది లోని నీరు స్వభావసిద్ధముగా మధురమైనవి, అమృత తుల్యాలని భావము)

విశేషాలు

1. తనంతట పారుచున్న ప్రవాహమును స్రోతస్సు అంటారు. స్వతః పరతీతి స్రోతః. సృ గతౌ

2. అంబుసః + నిధిః - ఇవ. (ష.త.స.) నీటికి పాత్ర వంటిది కనుక సముద్రమునకు అంబునిధి అనిపేరు.

3. అంభ శబ్దే + అసున్. (కృ.ప్ర.) . పాఱుచు చప్పుడుచేయునది. పరిమళముచే ఔరా అనిపించునది కనుక నీటికి అంభస్సు అనిపేరు.

4. స్వస్య భావః స్వభావః. తనయొక్క భావము స్వభావము .స్వభావముగగలిగిన గుణములను వస్తువు లెన్నడును విడువనేఱవు. మంచిగంధపుచెక్కను అరుగదీసినకొలది సువాసన వచ్చును; బంగారమును కాల్చినకొలది వన్నె హెచ్చును.అలాగే తామ్రపర్ణి నదికి మృతగుణము స్వభావమని కవి భావన.

5. రుచించునది కనుక మధురమయినదానికి, ఇష్టమయిన దానికి స్వాదు అని పేరు

.6. ఎప్పుడూ మూడు పదుల వయస్సులో ఉండేవారు కనుక దేవతలను త్రిదశులంటారు.ఉత్పత్తి , స్థితి, నాశము అను మూడు అవస్థలు కలిగినవారు కనుక త్రిదశులు.

7. సుఖేన ధీయతే పీయతే ఇతి సుధా- సుఖముగా పానము చేయబడునది కనుక అమృతమునకు సుధ అనిపేరు

22

క్షారోదకాస్వాదభవం విపాక

మపాకరిష్యన్నివ కుమ్భజన్మా

జహాతి శైలం మలయం న జాతు

పాతుం ప్రకృత్యా మధురం యదమ్భః

తాత్పర్యము

సముద్రపు ఉప్పు నీటిని తాగిన పరిణామమును తొలగించుకొనుటకు మలయపర్వతమునుండి జన్మించిన మధురమైన తామ్రపర్ణి నీటిని అగస్త్యుడు ఆస్వాదిస్తుంటాడు.( తామ్రపర్ణి నీరు మధురమైనవని భావం)

విశేషాలు

త్రివిధ-విపాకము :

భుజించిన ఆహార ద్రవ్యములందు, జఠరాగ్ని సంబంధమున జీర్ణమైన పిదప మధురాది రసములకు కలుగు రసాంతర పరిణామము విపాకమనబడును.

1. మధురవిపాకము, 2. అమ్లవిపాకము, 3. కటువిపాకము.

"త్రిధా విపాకో ద్రవ్యస్య స్వాద్వమ్లకటుకాత్మకా" [పరహితసంహిత 1-62]

23

యాం సర్వరత్నైకఖనిం విహాయ

గంగామధాత్కేనగుణేన శమ్భుః

కా ప్రీతిరర్కే సతి కైతకే౽పి

న హీశ్వరాః పర్యనుయోజ్యశీలాః

తాత్పర్యము

సర్వరత్నములు పుట్టు చోటయిన తామ్రపర్ణి నదిని వదలి, గంగను ఆ శివుడు నెత్తి మీద పెట్టుకొన్నాడు.

సువాసనలు వెదజల్లు మొగలి పువ్వును వీడి జిల్లేడు మీద ప్రీతి చూపించాడు. ఈశ్వరుని శీలాన్ని ఎవరు ప్రశ్నింపగలరు?

విశేషాలు

1. విహాయ

శతం విహాయ భోక్తవ్యం!

సహస్రం స్నానమాచరేత్!!

లక్షం త్యక్త్వా దాతవ్యం!

కోటిం త్వక్త్వ హరిం స్మరేత్!!

వంద పనులున్నా వదిలి భోజనం చేయాలి.. వేయి పనులున్నను మాని స్నానం చేయాలి. లక్ష పనులున్ననూ వాటిని విడిచి దానము చేయాలి. కోటి పనులున్నప్పటికి వాటిని విడిచి భగవంతుని స్మరించాలి

2. గంగ

హరశిరస్సువలన భూమిని పొందినది లేక హరి పాదమువలన భూమిని పొందినది కనుక గంగ

3. పంచ గంగలు కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి..

23

వైడూర్య నీలోపలమౌక్తికాని

యదాదిమధ్యాన్తసముద్భవాని

సా తామ్రపర్ణీ సరిదేవ యత్ర

సాధరణీ కాచన సారణీవ

తాత్పర్యము

తామ్రపర్ణి నది మొదట వైడూర్యాలు, మధ్యలో నీలమణులు, చివరలో మౌక్తికాలు ఉంటాయి. అయినా ఆ నది సామాన్యమైన పిల్లకాలువ వలె  భూమి మీద ప్రవహిస్తుంటుంది.

విశేషాలు

1. వైడూర్యము

విడూరదేశమునందు బుట్టిన రత్నము కనుక వైడూర్యము

పిల్లికన్రతనము, వైదూర్యము అని రూపాంతరములు

2. నీలము

నితరాం ఈడ్యతే నీలః . ఈడస్తుతౌ. బాగా కొనియాడబడునది కనుక నీలము. (నవనిధులలో ఒకటి )

3. ఉపల

లా ఆదానే-

ఉపలాతి భినత్తి వస్తూనితి ఉపలః . వస్తువులను ఖండించునది కనుక ఱాతికి ఉపల అని పేరు.

4. సరిత్

సరతీతి సరిత్. సృ గతౌ. ప్రవహించునది కనుక నదికి సరిత్ అని పేరు.

5. ధరణీ

విశ్వమును ధరించునది కనుక భూమికి ధరణి అని పేరు. (డుధాఞ్ ధారణపోషణయోః)

6. మౌక్తికము

ముత్యపు చిప్పలవలన విడువబడినది కనుక ముత్యానికి మౌక్తికమని పేరు

7. కాచన

ఈ పదప్రయోగంతో ఒకానొక చాటుకవి కృష్ణానదిపై వ్రాసిన మనోహర శ్లోక భావం ఇది

8. ఒకానొక నది (యమున) పరిచారికవలె శ్రీకృష్ణుని పాద ద్వయాన్ని కడుగుతూ ఉంటుంది. ఒక నది (గంగ) పరమశివుని ఇల్లాలై ఆయన శిరస్సుమీద కూర్చున్నది. మరొక నది (నర్మద) శంకరుని చెమట నుండి పుట్టి ప్రవహిస్తోంది. ఇంకొక నది (గోదావరి) ముక్కంటి జటాజూటము నుండి బయలుదేరింది. మరో నది (మందాకిని) పరమేశ్వరుని జటాజూటములో బంధింపబడింది.

9. ఇంకొక నది (గంగ) రూపాంతరమున శంతనునికి భార్య అయింది. మరొక నది (రేవానది) భీమసేనుని భార్య అయింది. రెండు నదులు (గంగ, సరస్వతి) పోట్లాడుకొని విష్ణులోకం నుండి భూలోకం మీదకు వచ్చి పడ్డాయి. ఇంకొక నది (భోగవతి) పాతాళలోకాల్లో ఒకటైన నాగలోకానికి వెళ్ళింది. అమ్మా నువ్వు ఇట్టి అవస్థలేవీ పొందలేదు కదా! నీ సహజమైన, దేదీప్యమైన నీలమేఘశ్యామల వర్ణాన్ని వదలకుండానే ఉన్నావు కదా! నీ పేరే సంసార తారకమైన పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణనామం. (పీసపాటి నరసింహశర్మగారి అనువాదముఆంధ్రజ్యోతి దినపత్రిక 13-08-2016). స్వస్తి.

24

తస్మిన్విశాలే తరుణేందు మౌలే

రావాసభూతం పదమద్భుతానామ్

వనం జగత్పావనమస్తి కించి-

న్నీపద్రుమాణాం నికషా వృషాద్రిమ్

తాత్పర్యము

 

ఆ విశాలమైన పాండ్య దేశములో వృష పర్వతము యొక్క సమీపములో ఒక శివుని ఆశ్రమమున్నది. అది కడిమి

చెట్లతో కూడినది.  ప్రపంచమును పవిత్రము చేసేది. అద్భుతములకు నివాసమయినది.

విశేషాలు

అద్భుతము

అత్ అనునది ఆశ్చర్యార్థకమైన అవ్యయము. ఆ ఆశ్చర్యమునకు ఉత్పత్తి స్థానము కనుక వింతయైనది” “ఆశ్చర్యకరముఅను అర్థములలో అద్భుతము అని పదము ఏర్పడుచున్నది. (భూసత్తాయాం)

పదము

పద్యతే అనేనేతి పదం పద్ ఌ గతౌ దీనిచేత పొందుదురు కనుక స్థానమునకు పదమని పేరు.

విశాలము

విస్తీర్యత ఇతి విశాలం.విస్తరింపబడునది కనుక ఎడముగలదానికి విశాలమని పేరు.

వృషము

వృషోహి భగవాన్ ధర్మః-. వర్షించునది లేదా వర్షింపబడునది

వృషము. ధర్మ స్వరూపుడైన శివస్వామి సమీపములోని కొండ కూడా ధర్మ స్వరూపిణియే.

తరుణేందు మౌళి

తరుణః ఇందుః మౌళౌ యస్య. (బహువ్రీహి సమాసము.)యౌవనము కలిగిన, కొత్తదైన చంద్రుని కిరీటము కలిగినవాడు కనుక శివుడు - తరుణేందు మౌళి.

నీపము

నయతి ప్రాణినస్సుఖం నీపః. ణీఞ్ ప్రాపనే. ప్రాణులకు సుఖాన్ని ఇస్తుంది కనుక కడిమిచెట్టుకు నీపమని పేరు.

అస్తి

అస గతిదీప్త్యాదానేషుప్ర.పు. ఏకవచనము పరస్మైపది

ఈ అస్తి అనే పదానికి వేదాంత పరిభాషలో విస్తృత ప్రయోగముంది.

అస్తి భాతి ప్రియం నామం రూపమ్ ఇతి

అంశ పంచకమ్ ఆద్య త్రయమ్ బ్రహ్మ

రూపమ్ తతో ద్వయమ్ జగద్రూపమ్

ఈ ప్రపంచము, అస్తి (సత్), భాతి (చిత్), ప్రియమ్ (ఆనందమ్)నామము, రూపము అనే ఐదింటితో)తయారైంది. మెదటి మూడూ బ్రహ్మ రూపము. చివరి రెండూ జగత్ రూపము జగద్రూపము)

వేదాంత దేవుడయిన శివుని పేరు కదలాడేసరికి ధాతువు కూడా వేదాంత సంబంధమైన అస్తి అని దీక్షితుల వారికి తోచింది.ఇదే దైవ కృప.

26

 

అజ్ఞాత తిగ్మాంశుకరావమర్శా

ఛాయా యదీయా తమసాం విహన్త్రీ

వాతేరితం పుష్పరజో యదీయం

నిఃశేషమున్మార్ష్టి రజః ప్రజానామ్

తాత్పర్యము

చండ కిరణములు కలిగిన సూర్యుని కిరణ స్పర్శ తెలియనిద ఆ ఆశ్రమ వనపు నీడ. (అంతదట్టంగా చెట్లున్నాయని భావం) గాఢమైన చీకటిని( తమోగుణమును)  అణుస్తుంటుంది. ఆ వనము లోని పూల సమూహమునుండి గాలుల ద్వారా వ్యాపించు  రజము( పుప్పొడి) గాలికి రేగుతూ ప్రజల యొక్క రజమును ( రజోగుణమును) పోగొడుతుంటుంది.

విశేషాలు

తేజయతీతి తిగ్మం తీక్ష్ణం చ. తిజ నిశాతనే- మిక్కిలి వేడియైనది

కీర్యతే, కరోతీతి చ కరః . కౄ విక్షేపే . ఇయ్యబడునది, , చేయబడునది కరము

మృజ్ శౌచాలంకరణయోః. ప్ర.పురుష. ఏక వచనము పరస్మైపదీ

వ్యు. న + జ్ఞాతమ్. (న.త.)

27

అంతర్నిలీన భ్రమరైః ప్రసూనై

రాభాతి యద్భద్ధరజోభిరీషత్

సత్వేన నిర్జిత్య రజస్తమశ్చ

సంమూర్ఛితేనైవ సమన్తతో౽పి

తాత్పర్యము

తమలోపల దాగిన తుమ్మెదల సమూహములచేత, పుప్పొళ్ళ చేత అందంగా ఉన్న ఆపూల సమూహములు- రజస్సును (పుప్పొడి, రజోగుణమును) తమస్సును( తుమ్మెదలను, తమోగుణమును) గెలిచి అంతటా విజృంభించిన సత్వగుణముల వలె ఉన్నాయి

పువ్వులను చుట్టూ తేనెటీగలు (భ్రమరాలు) అంతర్లీనంగా ఉండి వాటి మీద రజస్సు (పొడి ధూళి) ఏర్పడిన ఒక అద్భుతమైన వనం ఉంది.
ఈ వనం చుట్టూ రజోగుణం, తమోగుణాన్ని అధిగమించి, సత్వగుణం మెల్లగా వ్యాపించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తోంది.

ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఆధ్యాత్మిక శక్తి గల పవిత్ర ప్రదేశాలలో సత్వగుణం పరిపూర్ణంగా ఉంటుందనే భావన.ఇది కేవలం ప్రకృతి అందాన్ని మాత్రమే కాక, మనస్సును పరిశుద్ధం చేసే శక్తిని కూడా సూచిస్తుంది.

 

విశేషాలు

1. భ్రమరము

భ్రమతీతి భ్రమరః. భ్రము అనవస్థానే. తిరుగుచుండునది.

2. ప్రసూనం

ప్రసూయత ఇతి ప్రసూనం.షూజ్ ప్రాణి ప్రసవే. పుట్టునది.

3. భ్రమరకీట న్యాయం

తేనెటీగ పూవు నంటియున్న ముండ్లను వదలి దానిలోని మకరందమే పానముచేయును. (బుద్ధిమంతుడు దుర్గుణములను వదలి సుగుణములనే గ్రహించును.)

తేనెటీగ మకరందపానమునకై ప్రతిపూవుదగ్గఱకుబోవును. కాని సువాసన, మరకందము లేనిపూవుల దగ్గఱకు పోనేపోదు. (మతిమంతులు గుణవంతులసాంగత్యమే చేయుదురుగాని గుణహీనులు, అప్రయోజకులు నవువారి మొగమేనియుజూడరు.)

తేనెటీగ కుట్టినచో మనదేహము దద్దురువాఱి చాల బాధ ననుభవించును. అది మొనదేఱిన తన మొగమునందలి ముంటితో నెట్టికఱ్ఱనైనను రంధ్రము పడజేయును. కాని, మకరందమును ద్రావునేకాని అతి మృదులమవు కమలమున కాముంటితో నెట్టిహానియు జేయదు. (బద్ధిమంతుడు సమర్థుడయ్యు ఎవరికిని కష్టము కలిగింపడు.)

తుమ్మెద పురుగును దెచ్చి తన గూటినుంచి దానిచుట్టు తిరిగి ధ్వనిచేయుచు నుండగా నుండగా నాపురుగు ఆ నాదమువినుచు గొంతకాలమునకు తుమ్మెదగా మాఱును.

- 28

ఇంద్రవజ్రము

యత్రాభిషిఞ్చన్తి మధు క్షరన్తో

వృక్షా భువం మూర్తిమివాష్టమూర్తేః

ఝంకుర్వతే కర్ణేరసాయనాని

సామాని గాయన్త ఇవ ద్విరేఫాః

తాత్పర్యము

పాండ్యదేశములో చెట్లు తేనె కారుస్తూ అష్టమూర్తులలో ఒక శివ రూపమయిన భూమిని తడుపుతూ శివునికి అభిషేకం చేస్తున్నాయి.. శివునికి సామవేదగాన పూజ చేస్తున్నట్లుగా తుమ్మెదలు చెవులకు ఇంపుగా ఝంకారాలు చేస్తున్నాయి.

విశేషాలు

1. అష్టమూర్తి

వ్యు. అష్టమూర్తయః యస్య. (బహువ్రీహి సమాసము)

పంచభూతములు, సూర్యచంద్రులు, యజ్ఞకర్త-అను ఎనిమిది స్వరూపములు కలవాడు.

2. మూర్తి

మూర్ఛయతీతి మూర్తిః. ఆధిక్యమును పొందునది.

3. మధు

మన్యతే అభిలష్యత ఇతి మధు. మన జ్ఞానే. కోరికచే తలచబడునది (తేనె)

4. మధు పశ్యసి దుర్బుద్ధే ప్రపాతం నానుపశ్యసి అని ఒక సంస్కృతన్యాయము.

మూఢుడా! తేనెనే చూచుచున్నావుగాని, పతనమును మాత్రము గమనించుట లేదు.

5. ఒకడు చెట్టు చివరకొమ్మలో నున్న తేనెను సంపాదింపవలయునను పేరాసతో ప్రాకుచుండెనేగాని, అచటికొమ్మ విఱిగి తాను పడుటను మాత్రము గమినించుట లేదట.

అట్లే- తుచ్ఛకామసుఖము అనుభవించు కోరికచే చేయరాని పనులలో అడుగిడుటయేగాని మూఢులు దానివలన సంభవించు నరకమును మాత్రము గుర్తించరు.

దీనినే "మధు పశ్యసి దుర్బుద్ధే ప్రపాతం కిం న పశ్యసి" అని చెబుతారు.

6. వృక్షప్రకంపనన్యాయము :

మొదలటు నిటు ఊపితే చెట్టంత కదలినట్లు.

7. కొమ్మని ఊపితే చెట్టు కదలదు. చెట్టుమ్రాను నటునిటు శక్తికొలది ఊపితే చెట్టంతయు ఒక్కమాఱుగ కదులుతుంది. ఆవిధంగానే ఈశ్వరతేజోంశభవులయిన వివిధ దేవతలను వేఱువేఱు విధాలలో కొలిస్తే కేవలం ఆ మూర్తియే సంతోషిస్తాడు. సర్వమూలమవు ఆపరతత్త్వమును ధ్యానిస్తే విరాట్పురుషుని దయ సర్వదేవతో పాసనాఫలితమును పొందటానికి వీలవుతుంది.స్వస్తి.

29

వక్రాణి యస్మిన్మునిపాదపానా

మాభాన్తి పుష్పాణ్యతినిర్మలాని

సమాహృతా ముక్తిజుషాం ప్రదాతుం

శశాఙ్కఖణ్డా ఇవశంకరేణ

తాత్పర్యము

ఆ పాండ్యదేశములోని చెట్లు మునులవంటివి.ఆచెట్లకు గుంపులు గుంపులుగా నిర్మలములైన, వంకరగా ఉన్న పూలు పూసాయి. అవి శివుడు మోక్షము కోరువారికి ఇచ్చు చంద్రరేఖల వలె ఉన్నాయి.

విశేషాలు

1. ముని

సర్వధర్మాణాం మననాత్ మునిః సర్వధర్మములను ఎరిగినవాడు ముని. మన అవబోధనే

2. ముక్తులు

శరీరేంద్రియముల వలన ఆత్మ విడువబడుట ముక్తి. ఆత్మను సంసార బంధమునుండి విడిపించునది అని కూడ ముక్తికి ఇంకో అర్థం ( ముచ్ఌమోక్షణే)

3. మూడు రకాల ముక్తులు

క్రయముక్తి, 2. జీవన్ముక్తి, 3. విదేహముక్తి.

4. నాలుగు రకాల ముక్తులు

సాలోక్యము (విష్ణులోకమందుండుట), 2. సామీప్యము (విష్ణువు దగ్గఱనుండుట), 3. సారూప్యము (విష్ణురూపుడై యుండుట), 4. సాయుజ్యము (విష్ణువులో జేరియుండుట).

5. శిరస్థే శీతాంశౌ ( శివానంద లహరి -27) అనిశంకర భగవత్పాదులు శివుని శిరస్సు మీద చంద్రరేఖను ప్రత్యేకంగ ప్రస్తావించారు.

6. సలిలమ్ముల్ జుళుక ప్రమాణ, మొకపుష్పమ్మున్, భవన్మాళి ని

శ్చల భక్తిప్రతిపత్తిచే నరుడు పూజల్ సేయగా ధన్యుడౌ

నిల గంగానది జంద్రఖండమును దా నిందుం దుదిం గాంచు నీ

చెలువం బంతయు నీమహాత్త్వముదిగా! శ్రీకాళహస్తీశ్వరా! ( 106)

ఈశ్వరా! ఒక భక్తుడు నీయందు పరమభక్తితో నీ లింగముపై అరచేతి గుంటెడు నీళ్ళుపోసి, దానినే గంగానదిగాను, ఒక పుష్పమునుంచి దానినే చంద్రరేఖ గాను భావించి జీవన్ముక్తి పొందుతాడని ధూర్జటి కాళహస్తీశ్వరశతకములో చెప్పాడు.

7. చంద్రస్పర్శ కలిగిన తరువాత మనస్సు సాత్వికమై, పరమేశ్వరాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. మనసంటే చంద్రుడే, మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. కనుక మోక్ష సాధకులు శివుని శిరస్సుపై ఉన్న చంద్రరేఖను మననము చేసుకోవాలి. ఆచంద్ర్రరేఖలను పూల రూపంలో శివుడు ఇస్తున్నాడని దీక్షితుల వారి చమత్కారము.

30

సంపూర్యమాణాత్ప్రతిపౌర్ణమాసం

శాఖాగ్రసంఘట్టనతో౽వధూతాత్

మృగాఙ్కబిమ్బాద్గలితా ఇవోర్వ్యాం

మృగాః శతం యత్ర పరిభ్రమన్తి

తాత్పర్యము

ప్రతి పౌర్ణమిలోను చంద్రుడు అంతటా నిండిపోతాడు. ఎత్తయిన ఆ ఆశ్రమపు చెట్ల  కొమ్మల రాపిళ్లతో చంద్రునిలోని లేళ్ల సమూహాలు భూమి మీదికి  జారిపడ్డాయేమో ! అండుకే  అలా జారి పడిన అందమయిన ఆ జింకలు పాండ్యదేశములోని అడవుల్లో తిరుగుతున్నాయి.

విశేషాలు

1. పూర్ణిమ

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే తలములో నున్నప్పుడు సూర్యుని కాంతి చంద్రుని అర్ధభాగముపై పడగా చంద్రుడు భూమిపై నున్న వారలకు పూర్తిగా కనిపించుట.

2. చంద్రస్య పూర్ణతయా నిర్వృత్తా పూర్ణిమా .

చంద్రుని యొక్క నిండుట చేత నెరవేరినది

3. పూర్ణః మాశ్చంద్రో౽స్యామితివా పూర్ణిమా

అఖండచంద్రుడు గలది

4. మృగాంకః(చంద్రుడు)

మృగాః అంకో యస్య సః మృగాంకః

మృగము (లేడి) గుర్తుగా కలవాడు కనుక చంద్రునికి మృగాంకుడు అని పేరు.

5. ఉర్వీ(భూమి)

ఉరుత్వాత్ ఉర్వీ- ఘనమైనది

ఊర్ణూయతే పర్వతైరిత్యుర్వీ. ఊర్ణుఞ్ ఆచ్ఛాదనే పర్వతములచేత కప్బబడునది కనుక భూమికి ఉర్వి అని పేరు.

6. మృగము(లేడి)

మృగ అన్వేషణే. మృగ్యతే లుబ్ధకైః ఇతి మృగః

వేటగాండ్రచే వెదుకబడినది కనుక జింకకు మృగము అని పేరు.

7. పరి భ్రమతి

పరి పూర్వకమైన భ్రము చలనే. ధాతువు

పరస్మైపది లట్ ప్ర.పు. ఏక. భ్రమతి భ్రమతః భ్రమన్తి

మృగ వర్ణన కనుక చంద్రుని మృగాంకుడు అనుట సాభిప్రాయ మైన మనోహర ప్రయోగం. పరికరాలంకారం. ఉపమాలంకారం

 31

ప్రత్యర్థినో యత్ర మహేశ్వరస్య

తత్తత్క్షణోదన్తవిచారణాయ

చారా నియుక్తా ఇవ మన్మథేన

చరన్తి భృఙ్గాః సమమన్యపుష్టైః

తాత్పర్యము

మన్మథునికి శత్రువు శివుడు.తన శత్రువైన శివుని యొక్క కదలికలను ప్రతిక్షణము తెలుసుకొనుటకు మన్మథుడు నియమించిన గూఢ చారులవలె తుమ్మెదలు, కోకిలలతో కలిసి ఆపాండ్యదేశములోని ఉద్యానవనములలో తిరుగుచున్నవి.( ఉపమాలంకారం)

విశేషాలు

1. ప్రత్యర్థి

ప్రతికూలమర్థయతే ప్రత్యర్థీ . ప్రతికూలముగా కోరువాడు కనుక శత్రువుకు ప్రత్యర్థి అని పేరు.

2. మహేశ్వరుడు(శివుడు)

మహాంశ్చాసౌ వీశ్వరశ్చ శ్రేష్ఠుడైన ఈశ్వరుడు . గొప్ప ప్రభువు.

3. ఉదంతము.(సమాచారము)

ఉద్గతః అంతః యస్య. (బహువ్రీహి సమాసము)

4. క్షణము

18 రెప్పపాట్లు ఒక కాష్ఠ. 30 కాష్ఠలు ఒక కల. 30 కలలు ఒక క్షణము. త్రింశత్కలాః క్షణ ఇత్యుచ్యతే.

5. మన్మథుడు

బుద్ధిని కలవరము చేయువాడు.మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః మంథ విలోడనే

6. చారుడు

చరతి జానాతి పరబలమితి చారః చరగతౌ. గత్యర్థత్వాత్ జ్ఞానార్థత్వం . పరబలము తెలిసినవాడు కనుక గూఢ చారికి చారుడు అని పేరు.

7. భృఙ్గము

కార్ష్ణ్యం భరతీతి భృంగః భృఞ్ భరణే. నలుపును భరించునది కనుక తుమ్మెదకు భృంగమని పేరు.

8. అన్యపుష్టము(కోకిల.)

అన్యైః పుష్టః. (తత్పురుష సమాసము.) తన తల్లిచేకాక వేఱైనవానిచే పెంచబడినది.

9. చరన్తి

చరగతౌ. ప్రథమపురుష బహువచనము పరస్మైపదీ

32

ప్రాగమ్బయాథ ప్రమథాధిపేనా

ప్యధ్యాసితే యత్ర కదమ్బమూలే

మాకన్దజమ్బూవటపాదపానాం

మన్దాక్షమన్దాని కులాన్యభూవన్

తాత్పర్యము

కడిమిచెట్టు అమ్మకు చాల ఇష్టం. (కదంబవనవాసిని) అయ్యకు(శివునికి) కూడా. వారెప్పుడూ ఆచెట్టు మొదట్లో కూర్చుని ఉంటారట. అందుకని ఆచెట్టు వైభోగాన్ని చూసి మామిడిచెట్టు,నేరేడుచెట్టు,మర్రిచెట్టు మొదలయిన చెట్ల యొక్కవంశాలకు వంశాలు సిగ్గు తో చితికిపోతున్నాయి.

(పండ్లు బాగా కాసినప్పుడు చెట్టు కిందికి వంగినట్టు కనిపిస్తుంది. సిగ్గు కలిగినప్పుడు కూడా తల కిందికి వంగుతుంది కదా! ఆ పాండ్య దేశంలోని తోటలో మామిడిచెట్లు మొదలైన వాటికి పండ్లు బాగా కాసాయని చెప్పటానికి ఇదొక వక్రోక్తి.)

విశేషాలు

1. అమ్బా

అంబ్యతే శబ్ద్యతే బాలైరిత్యంబా. అబిశబ్దే. బాలురచే పిలువబడునది కనుక తల్లికి అమ్బా అనిపేరు.ఈశ్లోకములోని అంబ పార్వతీదేవి.

2. అథ

ప్రస్థాన త్రయంలో ఒకటైన బ్రహ్మ సూత్రాలలో మొదటిది అథ శబ్దంతో ప్రారంభమవుతుంది. (అథాతో బ్రహ్మ జిజ్ఞాసా)

ధర్మ శాస్త్ర గ్రంథాలు సైతం అథ శబ్దంతో ప్రారంభం అవుతున్నాయి. (అథాతో ధర్మ జిజ్ఞాసా)

శ్రీకారంతో ప్రారంభించడం శుభప్రదమని భావించడం తెలిసిన సంగతే.

అథ శబ్దం కూడా అలాంటిదే అని పండితుల భావన.

అథ శబ్దానికి పిమ్మట, శుభము, ఆరంభము, అన్ని అను అర్థాలున్నాయి.

3. ప్రమథగణము

శివుని అనుగ్రహమువలన కైలాసమున అతనితోకూడ ఉండు భక్తుల సమూహము.

4. అధ్యాసిత

ధేన్వా తదధ్యాసితకాతరాక్షయా నిరీక్ష్యమాణాః(రఘువంశము2-52)

5. పాదపము

పాపానే. పాదములనగా వేళ్ళు. వానిచే నీటిని తాగునవి కనుక చెట్లకు పాదపములు అనిపేరు

6. మన్దాక్షం

మన్దమక్షం వాగ్యత్ర మన్దాక్షం

మాటలు, కన్నులు మందంగా ఉంటాయి కనుక సిగ్గుకు మన్దాక్షము అనిపేరు.

7. అభూవన్

భూ సత్తాయామ్ లుఙ్ ప్రథమ పురుష బహువచనము

(లుఙ్ = భూత భవిష్యద్వర్తమానములను చెప్పే తద్ధర్మార్థక క్రియతో సమానమైన ఒకకాలము)

33

శాఖాసు శాఖాసు ఫలాని యత్ర

భాన్తీవ నానా పరమార్థతస్తు

సర్వాగమానాం ఫలమేకమేవం

సందృశ్యతే తచ్చ కదమ్బమూలే

తాత్పర్యము

శాఖ అను సంస్కృత విశేష్యమునకు 1. చెట్టుకొమ్మ.2. వేదభాగము.అను అర్థములుకలవు.దీక్షితులవారు ఈరెండు అర్థములను చమత్కారముగా వాడుకొన్నారు.

సాధారణంగా చెట్టుయొక్క కొమ్మకి పండ్లు అనేకపరిమాణాలలో ఉంటాయి. కొమ్మలు ఇచ్చేఫలాలు వేరు వేరు. అలాగే ఆగమాల వల్ల ఫలాలు అనేక రకాలు. కాని అన్ని ఆగమాలకదంబముగా కదంబ వృక్ష మూలములో శివుని రూపములో ఉన్న ఒకే ఫలము(పూర్ణసత్పలము) అమోఘమైన ఫలితాలను భక్తులకు అందిస్తున్నది.

విశేషాలు

ఆగమములు అనగా ఈశ్వరప్రోక్తములు అయి విశేష ధర్మములను చెప్పునట్టి శాస్త్రములు.

అవి శైవాగమములు, వైష్ణవాగమములు అని రెండువిధములు ఈఆగమములలో ముఖ్యముగా దేవాలయాది ప్రతిష్ఠలును దేవార్చనాది క్రమములును చెబుతారు. శైవాగమమును "పాశుపతము" వైష్ణవాగమములు "పాంచరాత్రము", "వైఖానసము"

శైవాగమములో, శివుడు (పశుపతి) లోకులు తన్ను పూజచేసే విధమును పార్వతికి చెప్పినట్లు ఉన్నది.

శివతత్త్వరత్నాకరములో 28 ఆగమాలను చెప్పారు.

1. కామికము, 2. యోగజము, 3. చింత్యము, 4. కారణము, 5. అజితము, 6. దీప్తము, 7. సూక్ష్మము, 8. సహస్రము, 9. అంశుమాన్, 10. సుప్రభ (సుప్రభేద)ము [ఇవి శివపరములు], 11. విజయము, 12. నిశ్శ్వాసము, 13. స్వాయంభువము, 14. ఆగ్నేయకము, 15. భద్రము, 16. రౌరవము, 17. మకుటము, 18. విమలము, 19. చంద్రహాసము, 20. మఖయుగ్బింబము, 21. ఉద్గీతము, 22. లలితము, 23. సిద్ధము, 24. సంతానము, 25. నారసింహము (సర్వోక్షము-సర్వోత్తరము), 26. పరమేశ్వరము, 27. కిరణము, 28. పరము (వాతూలము) [ఇవి రుద్రపరములు]

34

తృణీకృతే యత్ర వసద్భిరార్యై

శ్చరాచరే౽స్మిన్పశవశ్చరన్తి

వైకుణ్ఠవాసో౽పి తృణీకృతస్తై

ర్న చేత్కుతో౽సౌ హరిణాదృతః స్యాత్

తాత్పర్యము

పాండ్యదేశములో ఉంటున్న ఆర్యులచే  మిగిలిన చరాచర లోకాన్నినిరాకరించారు. అందుకే ఆ లోకాలలో పశువులు తిరుగుతున్నాయి. ఆర్యులు పాండ్యదేశమును ఆదరించి వైకుంఠనివాసాన్ని కూడా నిరాకరించారు. తనను ఆర్యులు నిరాకరించటం వల్ల వైకుంఠము తెల్లమొగం వేసింది. వైకుంఠము హరిణాదృతమయింది. (లేళ్లనే ఆదరింపబడినది  అని ఒక అర్థం. విష్ణునిచే ఆదరింపబడినది అని మరొక అర్థం.)

విశేషాలు

1. ఆర్యులు

ఋ గతౌ = ఋ + ణ్వత్. (కృత్ప్రత్యయము) సేవింప చేరతగినవాడు ఆర్యుడు.

వేదాది సంప్రదాయమును అనుసరించియుండు శిష్టాచారముతో వ్యవహరించువారు ఆర్యులు;.

2. ఆర్యులు వేదములయందు చెప్పబడినవారు. వీరుతొలుతసరస్వతీదృషద్వతీ నదులమధ్య ప్రదేశమునందు ఉండి పిదప

ఆర్యావర్తమునందు ఎల్లవ్యాపించిరి. ఈదేశమునందలి ఆచార వ్యవహారములు అన్నియు వీరే కల్పించినవారు.

(పురాణనామచంద్రిక యెనమండ్రం వెంకటరామయ్య)

3. వైకుంఠం

కుంఠం అనగా నాశనం;

వైకుంఠం = నాశరహిత మైన స్థానం.

నశించు ధర్మముగలది కుంఠము. అనగా అవిద్య, అజ్ఞానము

నాశరహితమైనది వైకుంఠము అనగా నిత్యజ్ఞానము.

పరిపూర్ణ పరిశుద్ధ జ్ఞానానుభవస్థితియే వైకుంఠము

4. శ్రీమహావిష్ణువు నివసించు వైకుంఠము ఆత్మవలె నిత్యమైనది.

ఆకాశమువలె విస్తారమైనది. చంద్రబింబమువలె ప్రకాశించునది.

(శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణము ప్రకృతిఖండము నారదనారాయణ సంవాదము ఏబదినాల్గవ అధ్యాయము 11వశ్లోకం)

5. వైకుంఠమునకు ఉన్న పర్యాయ పదాలలో తెలిదీవి ఒకటి.'తెల్ల, వెల్ల, పుల్ల, చిన్న' ల తుది ద్విత్వములో ఒకహల్లు లోపించి

వానిపై వర్ణము చేరుతుంది. అందుకే తెల్లదీవి అనునదితెలిదీవి అవుతుంది.

6. నచేత్

హస్త్య శ్వరథయానాని గచ్చమానాని పశ్యతి,

న చేత్ తస్యాగ్రతః పృష్ఠే తతో దుఃఖ తరంను కిమ్.

ఒకయేనుగుగాని, గుఱ్ఱముగాని, వాహనముగాని తనకు ముందు వెనుకలుగా పోవుచుండుటను చూడకుండుట కంటె మించిన

దుఃఖమేది?(శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటపదునైదవ అధ్యాయము 15)

-

35

పుష్పాయ వృక్షాగ్రపదాధిరూఢా

న్పుత్రాన్మునీనాముపలాలయన్తః

వ్యాజేన దేవాస్తపసో౽భిసన్ధి

పృచ్ఛన్తి నిత్యం పరిశఙ్కమానాః

తాత్పర్యము

మునులు తపస్సు చేస్తున్నారంటే దేవతలకు దేనికొరకు అని తెలుసుకోవాలని సందేహంతో కూడిన కోరిక. అందుకొరకు ఆ పాండ్య దేశములోని ఉద్యానవనములలో పూల కొరకు చెట్లపైకి ఎక్కిన మునుల పిల్లలతో దేవతలు మాట్లాడుతూ బుజ్జగిస్తూ , మైమరిపిస్తూ మాటల మధ్యలో వారి తండ్రుల తపో కారణాలను ప్రశ్నిస్తూ తెలుసుకొంటుంటారు. ( ఆ పాండ్యదేశములో మునులు శక్తి వంతులనియు, దేవతలు ఆ దేశములో నిత్య సంచారము చేస్తుంటారని భావం)

విశేషాలు

1. పుష్పం

పుష్ప్యతీతి పుష్పం. వికసించునది కనుక పువ్వుకు పుష్పమని పేరు

2. వృక్షము

వృశ్చ్యతే ఛిద్యత ఇతి వృక్షః. ఓవ్రశ్చూచ్ఛేదనే. ఛేదింపబడునది కనుక చెట్టుకు వృక్షమని పేరు.

3. అధిరూఢము (పెరిగినది)

అధికః రూఢః - అధి + రుహ్ + క్త. (కృ.ప్ర.)

4. దేవాః

దీవ్యంతీతి దేవాః క్రీడించు వారు కనుక దేవతలు

5. నిత్యం

నియతం భవతీతి నిత్యం- నియతమైనది( నియమము కలది) కనుక ఎడతెగని ఉనికికి నిత్యమని పేరు.

- 36

రోమాఞ్చసాన్ద్రా ఇవ కుడ్మలౌఘై

రుదశ్రుపూర్ణా ఇవ శీథువృష్ట్యా

భస్మానులిప్తా ఇవ పుష్పధూల్యా

దృష్ట్వామునీన్యత్ర భవన్తి నీపాః

తాత్పర్యము

ఈ పాండ్యదేశములో తపస్సు చేసుకొంటున్న మునుల ఆకారాన్ని తాము ధరించాలని కడిమిచెట్లు అనుకొన్నవి. శివ నామాన్ని తలిస్తే, జపిస్తే ఆనందంతో మునులకు రోమములు నిక్కబొడుచుకొని శరీరంపై పులకింతలు వస్తుంటాయి. అది చూసి ఆచేష్టను సగము విరిసిన మొగ్గల సమూహములతో కడిమిచెట్లు ప్రదర్శించాయి.

శివుని హృదయములో చూస్తున్నప్పుడు, శివ లీలలను స్మరిస్తూ పరవశిస్తున్నప్పుడు మునులకు ఆనంద బాష్పాలు వెలికి వస్తుంటాయి. దీనిని చూసి వెలికి వచ్చిన ఆ ఆనందపు కన్నీరు నిండిన మునుల చేష్టను పూలలోని మకరందపు వానలతో కడిమిచెట్లు ప్రదర్శించాయి

మునులు శరీరముపై బూడిద పూసుకొంటారు. అది చూసి తమపై రాలిన పుప్పొడులతో ఆబూడిద పూతలను కడిమిచెట్లు ప్రదర్శించాయి. ( శివ భక్తులయిన మునులను చూసి చెట్లు కూడా ఆకారాన్ని మార్చుకొన్నాయని మనోహరమైన భావన.)

విశేషాలు

1. రోమాఞ్చము

అంచు గతి పూజనయోః . రోమ్ణామంచనం రోమాంచః. రోమములు గగ్గురుపొడచుట

2. సాన్ద్రము

అది బంధనే. సహ అంద్యతే బధ్యత ఇతి సాంద్రం .కూడ కట్టబడియుండునది.(దట్టమైనది)

3. ఇవ

వద్వాయథాతథేవైవం సామ్యే. వత్, వా, యథా, తథా, ఇవ, ఏవం ఈ ఆరు పోలికయందు వర్తించును

4. కుడ్మల(కుట్మల)

కుట కౌటిల్యే. కుటతి ఈషత్కుట్మలః. ఇంచుకంత కుటిలమై ఉండునది.

5. ఓఘః

ఉచసమవాయే. ఉచ్యతే సంఘీభూయతే ఓఘః. కూర్పబడునది. (గుంపు)

6. భస్మన్యాజ్యాహుతిన్యాయము

బూడిదలో నేయి హోమము చేసినట్లు.

అకార్యము చేయాలనే మూర్ఖునకు బోధించుట నిష్ప్రయోజనము. అది కేవలము ఆయాసకారణము.

"నోపదేశశతేనాసి మూఢోఽకార్యా న్నివర్తతే,

శతాంశగ్రసనా త్కేన రాహు ర్వాక్యై ర్నివారితః?

అకార్యవారణోద్యుక్తో మూఢే యః పరిఖిద్యతే,

వాగ్విస్తరో వృథా తస్య భస్మన్యాజ్యాహుతి ర్యథా."

7. నీపము

నయతి ప్రాణినః సుఖం నీపః. ణీఞ్ప్రాపణే. ప్రాణులను సుఖము నొందించునది కనుక కడిమిచెట్టుకు నీపమని పేరు.

 

37

యస్మిన్మహేశానుకరాశ్రయేణ

కేనాపి కుల్యేన కృతావలమ్బాః

మృగా నిరాతఙ్కలవాశ్చరన్తి

మృగాదనైః ప్రత్యుత సేవ్యమానాః

తాత్పర్యము

శివుని చేతిలో ఉన్న మృగము మాకు  ఆత్మబంధువు  అని చెబుతూ ఆ అరణ్యములోని ఇతర జింకలు  కిరాతుల చేత సేవలు పొంది భయములేక  స్వేచ్ఛగా   తిరుగుచున్నవి.  .

38

వ్యాహన్యమానా మృగయాసు యస్మి

న్వ్యాఘ్రాః శివత్వం ప్రతి పద్య సద్యః

అస్మత్కులీనో౽సి మహానసీతి

హన్తృన్నికరాతానుపసాన్త్వయన్తే

విశేషాలు

ఆపాండ్య దేశములో వేటలో మృతిచెందిన పులులు శివసారూప్యాన్ని పొందాయి. ఆ పులుల ఆత్మలు శివత్వాన్ని పొందిన వెంటనే, తిరిగి వేటగానిని (తమను చంపిన వ్యక్తిని) చూస్తూ ఇలా అంటున్నాయి:

"నువ్వు మా వంశానికి చెందినవాడవు, గొప్పవాడవు! మమ్మల్ని చంపిన నీవు భయపడకు. మేము ఇప్పుడు శివస్వరూపులమయ్యాం."

.( కాశీలో మరణించినట్లుగానే పాండ్య దేశములో మరణించుట అదృష్టమని భావించిన పులులు వేటగాళ్లను పొగుడుతాయని ఆంతర్యం)

39ఇంద్రవజ్రము

దృష్టేష్వివానుశ్రవికేషు యస్మి

న్ధీరా వితృష్ణా ఇతి నాద్భుతాయ

స్వర్గాధికే ధామని సంవసన్తః

స్వర్గ్యాణి కర్మాణి కిమాద్రియేరన్

తాత్పర్యము

ఆ పాండ్య దేశములో నివసించుచున్న శివ భక్తులు ఐహిక విధులలో  కోరిక లేని వారు అని చెప్పుటలో వింతలేదు.స్వర్గము కంటె అధికమైన దేశములో నివసించుచున్న వారు స్వర్గలోకములోని కర్మలను లెక్కచేయరు. స్వర్గసంబంధమైన  కోరికలందు ఆసక్తి లేని వారికి ఐహిక విధులందు కోరిక ఎలాఉంటుంది?

విశేషాలు

అనుశ్రావికము/అనుశ్రవికము

1. వినికివలన పరంపరగా వచ్చినది.

2. వేదమునందు విధింపబడినది.

వ్యు. అనుశ్రవే విహితః-అనుశ్రవ + ఠక్‌. (త.ప్ర.)

ఆద్రియే

ఆహితవిలాస భంగీం ఆబ్రహ్మస్తంబ శిల్పకల్పనయా ఆశ్రిత కాంచీం అతులాం ఆద్యాం విస్ఫూర్తిం ఆద్రియే ...(ఆర్యాశతకం)

40

పాణౌ మృగం పార్శ్వతలే కిరాతీం

పర్యఙ్కబన్ధే చ గజం మహాన్తమ్

సంమామయన్నేవ చరత్యరణ్యే

పఞ్చాననః కో౽ప్యధునాపి యస్మిన్

తాత్పర్యము

ఆ పాండ్యదేశపు అరణ్యములో ఒక చేతిలో జింక, పక్కన కిరాత స్త్రీ , ఒడిలో ఏనుగును కలిగిన ఒకానొక సింహము (శివుడు అను సింహము) ఇప్పుడు కూడా స్వేచ్ఛగా తిరుగుచున్నది.

విశేషాలు

అరణ్యము(అడవి, కాననము)

ఋ = గతౌ-అర్యతే ఇతి-

మృగాదులచే యథేచ్చముగా సంచరింపబడునది

నవఅరణ్యములు

1. దండకము, 2. సైంధవము, 3. నైమిశము, 4. కురుజాంగలము, 5. జంబూమార్గము, 6. పుష్కరము, 7. ఉత్పలావర్తము, 8. హిమవంతము, 9. అర్బుదము [ఇవి ముక్తిదాయకములగు అరణ్యములు].

చతుర్దశ-అరణ్యములు :

1. నైమిశములు, 2. బదరిక, 3. దండకము, 4. చంపకము, 5. బృందము, 6. కదళిక, 7. గుహారణ్యము, 8. దేవతారణ్యము, 9. కేదారారణ్యము, 10. ఆనందారణ్యము, 11. దారుకారణ్యము, 12. వీక్షారణ్యము, 13. కామికారణ్యము, 14. మహారణ్యము.

పంచాననుడు :(శివుడు)

ఐదు మొగములు కలవాడు.

సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అను ఐదు ముఖములున్నవాడు

41

యద్వాదశాన్తైకవిభావనీయం

త్రయ్యన్తదృశ్యం కథమస్తు తన్నః

ఇత్యధ్యవస్యైవ తదావసన్తి

బ్రహర్షయః పాశుపతా మహాన్తః

తాత్పర్యం

పన్నెండు రూపాలలో భావించదగిన శివుని పరబ్రహ్మతత్వం , వేదత్రయంలో ప్రత్యక్షంగా ఎలా గ్రహించగలం? ఈ పరమతత్త్వాన్ని మనం ఎట్లు గ్రహించగలం?"" అని మహర్షులు ఆలోచిస్తూ, వారు శివధ్యానంలో స్థిరంగా ఉండి పాశుపతమార్గాన్ని అనుసరిస్తారు. చివరికి శివధ్యానమే అసలు మార్గమని నిశ్చయించుకుంటారు.

విశేషాలు

బ్రహ్మర్షి

1. బ్రహ్మ సమానులైన వసిష్ఠుడు మొదలైనవారు.

2. ఓంకారం, వషట్కారం, వేదాలు భాసించిన వ్యక్తి. విశ్వామిత్రుడి కథే ఇందుకు ప్రమాణం. దీర్ఘతపస్సు ఫలితంగా బ్రహ్మ సాక్షాత్కరించి ‘‘బ్రహ్మర్షిత్వం నీకు సిద్ధించింది. చిరంజీవివై సకల శుభాలతో వర్ధిల్ల’’మని చెప్పినప్పుడు విశ్వామిత్రుడు. ‘‘నాకు బ్రహ్మర్షిత్వం సిద్ధిస్తే ఓంకారం, వషట్కారం, వేదాలు స్వయంగా భాసించు గాక’’ అంటాడు. (‘‘ఓంకారశ్చ, వషట్కారో, వేదాశ్చ వరయంతు మామ్’’).

త్రయి / త్రయీ :

1. ఋక్ యజుస్సామ వేదాలు మూడింటిని కలిపి త్రయా అంటారని ఒక వాదం ఉంది.

2. ఋక్ యజుస్సామ వేదాలలోని మూడు విధాలైన మంత్రాలు కలసి త్రయా అని మరొక వాదం ఉంది. (భారతీ నిరుక్తి)

3. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞాన కాండ అనే త్రివిధాల వేదం.

దేవతలు దీని చేత స్తోత్రము చేయబడుదురు. (ఋక్)

పాపమును నశింపచేయునది (సామ)

దీనిచేత దేవతలు పూజింపబడుదురు (యజుః)

ఋగ్యజుసామభాగేన సాఙ్గవేద గతాపి వా! త్రయీతి పఠ్యతే లోకే దృష్టాదృష్టార్థ సాధినీ(దేవీ పురాణము 45 అద్యాయము)

4. వాద=జీవేశ్వరులకు సంబంధించిన అనేకవాదములయొక్క; శాన్త=ఉపశాంతిచేత;ఏకవిభావనీయం=శివుడొక్కడే భావించదగినవాడని తెలియుటవలన గాని' అని కూడా భావించవచ్చు.

42

వల్ల్యో యదీయాః కఠవల్లి కాద్యాః

శాఖాశ్చ మాధ్యన్దినకాణ్వముఖ్యాః

సర్వాగమస్తోమమయస్య తస్య

శక్నోతి కో వర్ణయితుం ప్రభావమ్

తాత్పర్యము

ఆ కదంబ వృక్షము యొక్క తీగలు కృష్ణయజుర్వేద శాఖలయిన కఠవల్లి మొదలయినవి;

ఆ కదంబ వృక్షము యొక్క కొమ్మలు శుక్ల యజుర్వేదంలోని మాధ్యన్దిన కాణ్వశాఖలు;

పాశుపతము మొదలయిన సర్వ శైవాగమములు మరియూ యజ్ఞ సమూహములతో కూడిన ఈశ్వర నివాసము కలిగిన ఆ కదంబ వృక్షము యొక్క ప్రభావమును వర్ణించుటకు ఎవడు సమర్థుడు కాడు. ( అది వర్ణనకు అతీతమైనదని భావం)

విశేషాలు

కఠవల్లి

కృష్ణయజుర్వేదంలో ఒక శాఖ. కఠోపనిషత్తు ఈ శాఖకు చెందినదే. కఠవల్లి అని కూడా పేరు దానికి. యముడికి, నచికేతుడికీ జరిగిన సంవాదం. మృత్యు విషయమంతా దీనిలో చక్కగా చర్చించబడింది.

మాధ్యన్దిన కాణ్వ'' శాఖ

శుక్ల యజుర్వేదంలోని 15 శాఖలలోను ఇప్పుడు రెండే ఉన్నాయి. అవి : మహారాష్టల్రోని ""కాణ్వ'' శాఖ, విదర్భ ఉత్తరభారతాలలో ఉన్న ""మాధ్యన్దిన'' శాఖ,

                                                సుందరనాథుని వర్ణనము

43

తస్మిన్కదమ్బద్రుమమూల సీమ్ని

తపః పరీపాక ఫలం జనానామ్

ఆస్తే జగన్మఙ్గలమఙ్గజారే

ర్లిఙ్గం దయావిగ్రహవత్త్వలిఙ్గమ్

తాత్పర్యము

ఆపాండ్యదేశమందు కదంబ వృక్షాల భూమిలో సజ్జనుల నోము పంటలసత్ఫలముగా,   రూపుధరించిన కరుణకు గుర్తుగా జగన్మంగళకరమైన మదనశత్రువయిన శివలింగము కలదు;

విశేషాలు

ఆస్తే

ఆస ఉపవేశనే అదాదిగణము ఆత్మనేపదీ లట్ ప్రథమ పురుష ఏక వచనం

పరీపాకం

పూర్తిగా పక్వమైనది. కర్మ పరిపాకం అంటే ఫలితాన్ని అనుభవించే దశకు చేరుకొన్న కర్మం.

లింగము

లింగ్యతే జ్ఞాయతే అనేనేతి లింగం. లిగి గతౌ . దీనిచేత ఎరుగబడును.

పానవట్టము (The base or trench into which libations, poured on the top of an idol, run down and flow to the spout. లింగపీఠము.) పైన శివమూర్తి; గుఱుతు; పంచవింశతి తత్వములలో(అష్టప్రకృతులు+ షోడశ వికారములు+ పురుషుడు) మొదటిదయిన ప్రకృతి అని లింగ శబ్దానికి అర్థాలు.

44

 

యద్గూహితం వాగ్భిరకృత్రిమాభి

ర్యద్ద్రష్టుకామ మునయో యతన్తే

నామ్నా చ రూపేణ చ సున్దరం త

త్ప్రత్యక్ష మాస్తే ప్రియకస్య మూలే.

తాత్పర్యము

అకృత్రిమమైన వాక్కులతో దాచబడినది, మునులు ఎప్పుడూ చూడాలని ప్రయత్నించేది,పేరులోను, ఆకారములోను

అందంగా ఉండు శివలింగము కడిమిచెట్టు మూలలో కన్నులఎదుట ఉన్నది.

విశేషాలు

అకృత్రిమము

వ్యు. న + కృత్రిమమ్. (నఞతత్పురుష సమాసము)

మనుష్యులచే చేయబడునది కృత్రిమము. వేద వాక్కులు అకృత్రిమములు. అందుకే అకృత్రిమమైన వేద వాక్కులతో శివలింగ రహస్యము దాచబడినదని కవి వర్ణన.

వాక్

ఉచ్యత ఇతి వాక్. వచ పరిభాషణే. పలుకబడునది

ద్రష్ట

చూచేవాడని సామాన్యార్థం. చిదాభాస యుక్తమైన అహంకారమని పారమార్థికార్థం. మంత్రాలను మనస్సుతో దర్శించేవాడు అని కూడా అర్థం.

ముని

సర్వధర్మాణాం మననాత్ మునిః. సర్వధర్మములను ఎరిగినవాడు ముని.మన అవబోధనే.

యతన్తే

యతీ ప్రయత్నే భ్వాదిగణము. ఆత్మనే పది లట్ , యతతే యతేతే యతన్తే

నామము

నమ్యతే అనేనేతి నామధేయం నామ చ. ణము ప్రహ్వత్వే శబ్దే. దీని చేత పలుకబడును కనుక నామధేయము

రూపము

రోపయతి విమోహయతీతి రూపం. రుపు విమోహనే.మోహింపచేయునది

సున్దరం

సుతరాం అద్రియత ఇతి సుందరం. దృఙ్ ఆదరే. మిక్కిలి సంతోష పెట్టునది

తత్

యత్తద్యతస్తతోహేతౌ- యత్, తత్, యతః, తతః ఈ నాలుగును కారణమందు వర్తిస్తాయి

ప్రియక( కడిమిచెట్టు)

ప్రీణాతీతి ప్రియకః. ప్రీఞ్ తర్పనే. .ప్రీతిని చేయునది కనుక కదంబవృక్షానికి ప్రియకమని పేరు.

ప్రత్యక్షమ్

ప్రతిగతం అక్షమింద్రియం ప్రత్యక్షం- ఇంద్రియమును పొందునది .

ఆస్తే

ఆస ఉపవేశనే అదాదిగణము ఆత్మనేపదీ లట్ ప్రథమ పురుష ఏక వచనం

45

పాండ్యార్పితా భాత్యధునాపి యస్మి

న్నృజ్వాయతా వేత్ర నిపాత రేఖా

నానారహస్యాగమ బోధనీయాం

నాదాత్మతామస్య వివృణ్వతీవ

తాత్పర్యము

అనేక రహస్య ఆగమములందు తెలియబడు తన నాదమయతను తెలియచేయు విధముగా ,ఇప్పుడు కూడా పాండ్యుడను రాజు పూజించిన శివలింగము – పాండ్యుని బెత్తపు దెబ్బ పడిన గీతలతో సరళతతో , పొడవుగా ప్రకాశించుచున్నది.

విశేషాలు

01.నాదములు

వాగ్గేయ కారులలో త్యాగయ్య అనే పేరు- తెలుగు వారికి ఆ మాట కొస్తే వెలుగు కోసం అన్వేషించే వారికి సుపరిచితమైన

ఆత్మీయమైన పేరు.త్యాగరాజు- త్యాగబ్రహ్మము- ఈ పేర్లకంటె కూడా-అయ్యదగ్గరికి వెళ్లే సంగీతపు త్రోవని సుగమము చేసినవాడు

కనుక త్యాగయ్య అంటే అయ్య బుగ్గ మీద పసి పిల్ల చిటిపొటి వేళ్లతో పామినంత దివ్యానుభూతి.

త్యాగయ్య పరిచయాలు అక్కరలేని వాగ్గేయ కారుడు.నాద సుధారసముతో శ్రీరాముని పోల్చిన త్యాగయ్య నాద తనువు కలిగిన

వానిగా శివున్ని నాదతనుమనిశం కీర్తనలో పోల్చాడు.

నాదము అంటే ..... సామాన్యంగా మనం చెప్పుకొనే అర్థం

ధ్వని, మ్రోత. -1. ఆహతము, 2. అనాహతము అని ఇంకో రెండునాదాలు ప్రసిద్ధి. ("ఆహతోఽనాహతశ్చేతి ద్వేధా నాదో నిగద్యతే")

సంగీతములోని ఒక గమక భేదము ఆహతము. దౌడ మొదలైన వాటిస్పర్శలేకుండా పుట్టే ధ్వని అనాహతము. అతిసూక్ష్మము, 2.

సూక్ష్మము, 3. పుష్టము, 4. అపుష్టము, 5. కృత్రిమము అని పంచసూక్ష్మ నాదాలు ఉన్నాయి.1.జలనాదము, 2. భేరీనాదము, 3.

మృదంగనాదము, 4. ఘంటానాదము, 5. కాహళనాదము, 6.కింకిణీనాదము, 7. వేణునాదము, 8. భ్రమరనాదము, 9. కారనాదము,

10. శంఖనాదము అని పది నాదాలున్నాయి. వీటిలో ఏ నాదాన్నిశరీరముగా శివుడు కలిగి ఉన్నాడు.? అనే ప్రశ్నకు ఏనాదము

శరీరముగా కలిగి లేడు ?!అనేది జవాబు. అన్ని నాదాలు ఆయనే.

ఎక్కడ నాదము ఉన్నదో అక్కడశివ సంచారమున్నదని భావించాలి.

02.వేత్రాహతి

శివునికి తమిళ కవులు బెత్తపు దెబ్బలు తినిపించారు.వేత్రాహతిం విభక్తుం విశ్వాత్మకతా ప్రదర్శితా భవతా. కరగత కబళగ్రాసే పున రఖినీతం శివాద్వైతమ్. అని ఒక ప్రసిద్ధ శ్లోకం వేత్రాహతిం=బెత్తపు దెబ్బ (లు), విభక్తుం=పంచి పెట్టుటకు, భవతా=నీచే, విశ్వాత్మకతా=సర్వాత్మకత్వము, ప్రదర్శితా=ప్రకటన చేయ-బడెను, కర...గ్రాసే, పునః=చేత నున్న దోసెలు తినునపు డన్ననో, శివాద్వైతము (శివుడు జీవు-డు అను ద్వైతము చెప్పునది శివాద్వైతమ,) అభినీతమ్‌=అభినయింప-బడెను. నీవు దెబ్బలుమాత్రము అందఱకును పంచితివి; దోసెలనోనీవొక-డవేతింటివని తాత్పర్యము. .(జగద్గురు బోధలు 3వ సంపుటం)దీక్షితుల వారు కూడా ఈ బెత్తపుదెబ్బల గుర్తులను ప్రస్తావించారు.

03. భాతి

భాదీప్తౌ . ప్రథమపురుష ఏకవచనం పరస్మైపది

పంకైర్వినా సరో భాతి సదః ఖలజనైర్వినా

కటు వర్ణైర్వినా కావ్యం మానసం విషయైర్వినాఅని కవి ప్రయోగం

గంగ అనెడి మహా జలాశయము నీటిబొట్టు వలెకదలకుండాఉన్నది.

46

సమస్తదివ్యాగమ సంప్రతీతే

తారాత్మకే తత్ర మహేశలిఙ్గే

అర్ధేందురర్ధేన్దుతయైవ దృష్టో

బిన్దుస్తు సిన్ధుః స్తిమితా జటాగ్రే

తాత్పర్యము

ఆ పాండ్యదేశములోఅఖిలమైన శ్రేష్ఠమైన పాశుపతము మొదలైన ఆగమములందు ప్రసిద్ధి పొందిన సుందరనాథ లింగమూర్తి ఉన్నాడు. నక్షత్రములను తన పైన కలిగిన సుందరనాథ లింగమూర్తి యొక్క జడలు కట్టిన వెంట్రుకల సమూహము చివరలో అర్థచంద్రుడు అర్ధేందువు(అర్ధచంద్రాకారము కల బాణము) వలె కనబడుతున్నాడు. గంగ అనెడి మహా జలాశయము నీటిబొట్టు వలె కదలకుండాఉన్నది.

విశేషాలు

 దృష్ట సంసారం

మనకు నిత్యం కనిపిస్తుండే సాధారణ సంసారాలు దృష్టసంసారాలు. శాస్త్రంలో, వివిధ గ్రంథాలలో మనం చదివి తెలుసుకొనే

పరలోక సంసారాలు శ్రుత సంసారాలు.

సిన్ధుః

సిన్ధు పదానికి ఉన్న రకరకాల అర్థాలు ఇవి. సముద్రము; ఏనుగు;ఒక దేశము; ఏఱు.వీటిలో ఏఱు అనునది ఈ శ్లోకంలో కవి ఉద్దేశ్యానికి

సరిపోవునని అర్థముగా స్వీకరించటమైనది.(శ్రీ నటేశ్వర శర్మగారిసౌజన్యం)

బిన్దుః

విస్తీర్యతే యశో లోకే తైల బిన్దు రివామ్భసి(మనుస్మృతి)

స్తిమితా

స్తిమితోన్నత సంచారా జన సంతాపహారిణః

జాయన్తే విరలా లోకే జలదా ఇవ సజ్జనః(పంచతంత్రము)

ఉపజాతి

47

మూలం చ మౌళిం చ వివేక్తుకామౌ

యస్యాక్రమేతాం విధిరచ్యుతశ్చ

తన్మూలమేతత్తరుమూల గమ్యం

తన్మౌళిరేతత్తరుమౌళివేద్యః

తాత్పర్యము

ఏ శివ లింగము యొక్క మూలాన్ని , సిగను తెలుసుకోవాలని బ్రహ్మయు విష్ణువును ప్రయత్నించారో ,ఆ శివలింగము యొక్క మూలము ఈ పాండ్యదేశములోని చెట్టు యొక్క మూలములో లింగాకారములో ఉన్నది. ( లేదా చెట్టు యొక్క వేరు అని ఇంకొక అర్థం)ఆ మౌళి ( సిగ,శివుడు) ఆకాశమును అతిక్రమించు చెట్టు యొక్క  ఎత్తులో ఉన్నది.  (గొప్పచెట్టు అని భావం)

విశేషాలు

1) మూలము

మూలతీతి మూలః. మూల ప్రతిష్ఠాయాం. నిలుకడ కలిగి ఉండునది.

మూల శబ్దము మొదటికిని, ఊడకును , మూలా నక్షత్రమునకు పేరు.

ఈ కలహమునకు మూలమెవరు who was the beginning of this quarrel)

అది సమూల నాశనమైనది it is ruined, root and branch.

ఋషిమూలము నదిమూలము విచారింపరాదు you must not inquire into the origin of a Rishi of a river.

ఆ సంగతిని ఆమూలాగ్రముగా విచారించినాను I examined it throughly.

మూల విగ్రహము the chief image in a temple.

బద్ధ మూలస్య మూలం హి మహద్వైరతరోః స్త్రియః (శిశు.2-38) అని కవి ప్రయోగం

2) మౌళి

మల్యత ఇతి మౌళిః . ధరింపబడునది కనుక కిరీటమునకు మౌళి అని పేరు.మౌళి పదము ఉత్తరపదమైనచో శ్రేష్ఠార్థకము. మౌళి శబ్దానికి శివుడని

కూడా ఇంకొక అర్థం. చన్ద్రమౌళి, అర్ధేందు మౌళి,ఇందుమౌళి, మృగాంక మౌళి,నిశాకర కలామౌళి,శశధర మౌళి, శశిమౌళి,జటామౌళి అని శివునికి పేర్లు.మౌలౌవా రచయాంజలిం(కుమా.05-079)అని కాళిదాసు ప్రయోగం

3) ఆక్రమణము

బలిమిచే వశపఱచుకొనుట.క్రము పాదవిన్యాసే-ఆ + క్రమ్ + ల్యుట్. (కృత్ప్రత్యయం)

4) విధిః

విదధాతీతి విధిః. సర్వము చేయువాడు (బ్రహ్మ)విధి అనగా చేయవలసిన పని, వేదం చెప్పిన పద్ధతి అని కూడాఅర్థాలు. త్రివిధమైన విధులు : 1.అపూర్వవిధి, 2. నియమవిధి, 3. పరిసంఖ్యావిధి.

కల్యాణీ విధిషు విచిత్రతా విధాతుః , కుర్యాత్ క్రియేత కర్తవ్యంభవేత్

స్యాదితి పంచమం/ఏతత్ స్యాత్ సర్వవేదేషునియతం విధి లక్షణం

అని కవి ప్రయోగాలు

5) అచ్యుతుడు

నాశము లేనివాడు.స్వస్వరూప సామర్థ్యాత్ న చ్యుతః చ్యుతో వా

న + చ్యుతః. (నఞ్ .తత్పు.)

6) లింగోద్భవం

మాఘ మాసం కృష్ణ పక్షం, చతుర్దశి తిథి రాత్రివేళ లింగోద్భవంజరిగినట్లు స్కాంద తదితర పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి.. చతుర్దశి పగటివేళ ముగిసినప్పటికీ ఆ నాటి అర్ధరాత్రి లింగోద్భవవేళగా పరిగణించవచ్చు. అదే రోజు శివరాత్రి పర్వదినంగాపాటించడం సంప్రదాయం. బ్రహ్మ విష్ణువులకు తన ఆధిక్యాన్నితెలియజేయడం కోసం శివుడు జ్యోతి రూపంలో ఒక స్థంభంగాఅంతు తెలియనంతగా, ఆద్యంతాలు కనిపించ నంతగా పైకీ,క్రిందికీ వ్యాపించాడనీ, బ్రహ్మ విష్ణువులు లింగం ఎక్కడ మొదలోఎక్కడ చివరో తెలుసుకొన లేనప్పుడు శివుడు అగ్ని స్థంభం మధ్యలోవారికి దర్శనం ఇచ్చాడనీ పురాణ గాథ.

ఈ పురాణకథపై కవి అల్లిన అందమైన భావమంజరి పై శ్లోకం

------------------------------------------------------------

48

ఛన్నం ప్రసూనైః స్నపితం మరన్దై

రలంకృతం భోగిభిరాపతాద్భిః

ఇత్థం స్వయం పూజితమస్తి నిత్యం

స్వాయంభువం సున్దర నాథలిఙ్గమ్

తాత్పర్యము

తనకు తానే పుట్టిన ఆ సుందర నాథ శివ లింగము ప్రతి రోజూ ఎవరూ పూజలు చేయకుండానే స్వయంగా పూజలు పొందుచున్నది.

చెట్టు నుంచి పడు పువ్వులు పుష్ప పూజలు చేస్తున్నాయి. వానిలోని మకరందాలు నిరంతరము అభిషేకము చేస్తున్నాయి. పాములు

పూజకు పెట్టిన అలంకారాలుగా ఉన్నాయి.

విశేషాలు

1) ప్రసూనము

పుష్పము;2. ఫలము. ప్రసూయత ఇతి ప్రసూనం షూఙ్ ప్రాణి ప్రసవే. పుట్టునది.

2) ఆపతాత్

తదాపతాద్ వై త్రి శిఖమ్ (శ్రీ భాగవతం 10.59.9)

3) ఛన్నం

ఛద అపవారణే. (కప్పబడినది )

4) మరందము

మకరందము యొక్క రూపాంతరము. మంక్యతే పుష్ప్యతే అనేనేతి

మకరందః. మకి మండనే. దీనిచేత పుష్పము అలంకరింపబడును

5) స్నపితం

స్నపిత ఇవ చ దుగ్ధ స్రోతసా (మాలతీ మాధవం)

స్ఫీత స్మితస్నపితాధరాం (గీత గోవిందం) అని ఇతర కవి

ప్రయోగాలు

6) భోగి

భోగస్సర్పశరీరం తదస్యాస్తీతి భోగీ. భోగమనగా సర్పశరీరము. అది

కలిగినది.

7) అలంకృత

అలంక్రియతే స్మ అలంకృతః . డుకృఞ్ కరణే.

8) ఇత్థం

ఇత్థంభూతము =ఇట్టిది. ఈ ప్రకారముగలది.ఇత్థంవిధము =ఇట్టివిధము గలది.

ఇత్థం రతేః కిమపి భూత మదృశ్య రూపమ్ (కుమా4.45;) అని ఇతరకవి ప్రయోగము

9) అస్తి

అస గతిదీప్త్యాదానేషుప్ర.పు. ఏకవచనము పరస్మైపది

ఈ అస్తి అనే పదానికి వేదాంత పరిభాషలో విస్తృత ప్రయోగముంది.

అస్తి భాతి ప్రియం నామం రూపమ్ ఇతి అంశ పంచకమ్ ఆద్య త్రయమ్ బ్రహ్మ రూపమ్ తతో ద్వయమ్ జగద్రూపమ్

ఈ ప్రపంచము, అస్తి (సత్), భాతి (చిత్), ప్రియమ్

(ఆనందమ్)నామము, రూపము అనే ఐదింటితో)తయారైంది. మెదటి మూడూ బ్రహ్మ రూపము. చివరి రెండూ జగత్ రూపము

జగద్రూపము)వేదాంత దేవుడయిన శివుని పేరు కదలాడేసరికి ధాతువు కూడా వేదాంత సంబంధమైన అస్తి అని దీక్షితుల వారికి తోచింది.ఇదే దైవ

కృప.

50

తస్మిన్నహం పూర్వికయా విశద్భి

రపాస్తబన్ధైరధునాపి జీవైః

సంబాధ దుఃస్థైరజనిష్ట లిఙ్గే

సార్వత్రికీ దన్తురతేతి శఙ్కే

తాత్పర్యము

జనాలు విపరీతంగా ఒక పద్ధతి లేకుండా తిరుగుతుంటే ఏ దారిఅయినా (ఎగుడు దిగుడుగా, ఎత్తుపల్లాలతో ) మిట్టపల్లమవుతుంది

. ఈ అంశాన్ని శివలింగానికి దీక్షితుల వారు సమన్వయించి చమత్కరించారు.పాండ్య దేశంలోని సుందరనాథ శివలింగంలో

కూడా ఎత్తు పల్లాలు ఉన్నాయి. దీనికి కారణమిది .

బంధములు పోయిన జీవులు కూడా సుందరనాథశివలింగాన్ని చూడాలనే కోరికతో మళ్ళీ పుట్టారట. స్వామిని చూసినపారవశ్యంతో . ఇక జన్మ ఎత్తకూడదు..మోక్షం పొందాలి అనుకొని..సుందరనాథ శివలింగంలో ముందు నేను ...ముందు నేనుప్రవేశించాలిఅనే కోరికతో జీవాత్మలు సందడిచేసాయట. ఒకేసారిఅంతమందిమోక్షంకోసం ప్రవేశించేసరికి వారి పదహతులచేలింగంలోఎత్తు పల్లాలు ఏర్పడ్డాయి. (శివుడు మోక్ష దాయకుడనేభావనకు కవితా చమత్కారమిది.)

విశేషాలు

1.అహంపూర్విక

నేను ముందు నేను ముందనుచు యుద్ధమున వీరులుతీయు

పరుగు.

అహంపూర్వ + ఠన్-ఇక. (త.ప్ర.)

2. అజనిష్ట

జనీప్రాదుర్భావే లుఙ్ ప్రథమపురుష ఏకవచనం. అజని/అజనిష్ట-

అజనిషాతామ్- అజనిషత

--------------------------------------------------------

50.

గూఢం భవామీత్యభిమాన మాత్రం

గూఢం పరం జ్యోతిరిదం కథం స్యాత్

యన్మూర్ధని ప్రత్యుత చన్ద్రరేఖా

తేనైవ తత్ప్రైక్షి కదమ్బమూలే

తాత్పర్యము

“”రహస్యంగా, ఎవరికి కనిపించకుండా ఉందునుఅని శివుడు చెప్పిన మాట వట్టి గరువముతో చెప్పిన మాట.ఈ శివ పరమాత్మ స్వరూపము రహస్యంగా ఉండుట కుదరదు.అతని శిరస్సుపై మనసార , ఇష్టముగా ధరించిన చంద్రరేఖ అతనిస్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది.

ఈవిధంగా చంద్రరేఖతో భక్తులను చల్లగా చూస్తూ కదంబ వృక్ష మూలమునందు అతడు చూడబడుచున్నాడు.

విశేషాలు

1. భవామి

భూసత్తాయామ్ ఉ.పు. ఏక.పరస్మైపది

2. గూఢం

గుహ్యతే స్మ గూఢం . గుహూ సంవరణే. దాచబడినది.

3. స్యాత్

అస భువి ప్ర. పు. ఏక. పరస్మైపది

4. ప్రత్యుత

కృతమపి మహోపకారం పయ ఇవ పీత్వా నిరాతఙ్కః / ప్రత్యుతహన్తుం యతతే కాకోదర సోదరః ఖలో జగతి. ( పాలు తాగి కూడా

పాముకి తోబుట్టువు విష క్రియ చేస్తాడు.)

5. ప్రైక్షి

ప్రేక్ష్యతే అనయేతి చ ప్రేక్షా . ఈక్షా దర్శనాంకనయోః . చూచుటయు,చూడబడునది ప్రేక్ష.దానినుంచి ప్రైక్షిరూపము

ఛాయామయః ప్రైక్షి కయాపి హారే నిజే సగచ్ఛన్నథ నేక్ష్యమాణః(నైషధీయ చరితం 06-30)

52

ఖ్యాతాః కలా యద్యపి తత్ర లిఙ్గే

పఞ్చైవ సిద్ధాః శివశాసనేషు

తథాపి తేనాధ్యుషితే తు దేశే

కలాశ్చతుః షష్టిరపి స్ఫురన్తి

తాత్పర్యము

బాగా పేరు పొందిన కళలు అరువది నాలుగు అయినప్పటికిని పాండ్యదేశములోని సుందరనాథ లింగమునందు అయిదుగా మాత్రమే (ఆనందం, మనసు, ప్రాణం, విజ్ఞానం, వాక్కు) శివ శాసనములందు ప్రసిద్ధి పొందాయి;అట్లయినప్పటికి ఆశివలింగమును నివాసముగా చేసుకొని ఆ శివలింగము ఉన్నచోటులో అరువది నాలుగు కళలు స్ఫురించుచున్నవి;

విశేషాలు

1) స్ఫురన్తి

స్ఫుర సంచలనే. తుదాదిగణము, పరస్మైపదీ, లట్ బహువచనము

2) అధ్యుషితము

1. కాపురమున్నది - నివాసముగా చేసికొనబడినది.2. అధిష్టింపఁబడినది.

వస - నివాసే - అధి + వస + క్త. (కృ.ప్ర.)

బలైరధ్యుషితాస్తస్య (రఘువంశం 04-46)

3) తు :

విశేషమందును, నిశ్చయమందును

, హేతుపాదపూరణములయందును వర్తించును.

4) దేశము

బ్రహ్మ పదార్థం దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితం :ఎలాగంటే,మహాకాశం వలె సర్వవ్యాపి కనుక దేశ పరిచ్ఛేదం లేదు.

త్రికాలాలకు/ అన్ని కాలాలకు వర్తించేది కనుక కాల పరిచ్ఛేదమూలేదు. సర్వ స్వరూపం కనుక వస్తు పరిచ్ఛేదమూ లేదు. కనుక దేశ

, కాల, వస్తు పరిచ్ఛేదం లేని ప్రత్యగభిన్న బ్రహ్మ పదార్థం. (దేశానికీ,కాలానికీ అధిష్ఠానం కావడం వల్ల బ్రహ్మం దేశకాలాపరిచ్ఛిన్నం

కూడా). కనుకనే దీక్షితుల వారు దేశ పద ప్రయోగము శివ బ్రహ్మవర్ణనలో చేసారు.దేశకాలవయోవస్థాబుద్ధిశక్త్యనురూపతః ధర్మోపదేశో భైషజ్యం వక్తవ్యం

ధర్మపారగైః :( సంస్కృతన్యాయము)

ధర్మమును, వైద్యమును దేశ,కాల, వయోఽవస్థా, బుద్ధి, శక్తులకనురూపముగ చెప్పవలయును.

5) కళలు

త్రివిధ-కళలు ,చతుర్-కళలు ,షట్-కళలు ,సప్త-కళలు ,ద్వాదశ-కళలు ,షోడశ-కళలు ,చతుష్షష్టి-కళలు ,ద్విసప్తతి-కళలు లోకంలో

ప్రసిద్ధి.

6) పరమేశ్వరుడు పంచ కళామూర్తిఅని పెద్దలు చెబుతారు. ఆఅయిదు కళలు- ఆనందం, మనసు, ప్రాణం, విజ్ఞానం, వాక్కు.

7) అరవై నాలుగు కళలు

అరవై నాలుగు కళలు ఏవి అనే విషయంలో భిన్నమైన పట్టికలుఉన్నాయి. అందులో రెండు పట్టికలు:

మొదటిది:

గీతం, వాద్యం, నృత్యం, నాట్యం, ఆలేఖ్యం (వ్రాత/ గీత), విశేషకచ్ఛేద్యం, తండుల, కుసుమ, బలి వికారాలు, పుష్పాస్తరణం, దశన, వసన అంగరాగాలు, మణి భూమికా శయన రచన, ఉదక వాద్యం, ఉదక ఘాతం, చిత్రా యోగాలు, మాల్య గ్రథన వికల్పాలు, కేశ శేఖరాపీడ యోజనం, నేపథ్య యోగాలు, కర్ణ పత్ర భంగాలు, గంధ యుక్తి భూషణ యోజనం, ఇంద్ర జాలం, కౌచుమార యోగం, హస్త లాఘవం, చిత్ర శాకా పూప భక్ష్య వికార క్రియ, పానక రస రాగాసవ యోజనం, సూచీ వాప కర్మ, వీణా డమరుక సూత్ర క్రీడ, ప్రహేళిక, ప్రతిమా దుర్వచక యోగాలు, పుస్తక వాచనం, నాటికాఖ్యాయికా దర్శనం, కావ్య సమస్యా పూరణం, పట్టికా వేత్ర బాణ వికల్పాలు, తర్కు కర్మలు (నూలు వడకడానికి సంబంధించినవి), తక్షణం (చెక్కడం), వాస్తు విద్య, రూప్య రత్న పరీక్ష, ధాతు వాదం, మణి రాగ జ్ఞానం, ఆకర జ్ఞానం, వృక్షాయుర్వేద యోగాలు, మేష కుక్కుట లావక యుద్ధ విధి, శుక సారికా ప్రలాపనం, ఉత్సాదనం (నలుగు పెట్టడం), కేశ మార్జన కౌశలం, అక్షర ముష్టికా కథనం, మ్లేచ్ఛితక వికల్పాలు, దేశభాషాజ్ఞానం, పుష్ట శకటికా నిమిత్త జ్ఞానం, యంత్ర మాతృక, ధారకా మాతృక సంపాట్యం(టం), మానసీ కావ్య క్రియ క్రియా వికల్పాలు, ఛలితక యోగాలు, అభిదాన ఛందో జ్ఞానం, వస్త్ర గోపనాలు, ద్యూత విశేషం, ఆకర్షణ క్రీడ, బాలక క్రీడనకాలు (క్రీడా సాధనాలు), వైనాయికీ విద్యా జ్ఞానం, వైజయికీ విద్యా జ్ఞానం, వైతాలికీ (వైయానికీ) విద్యా జ్ఞానం.

రెండవ పట్టిక:

ఇతిహాసం, ఆగమనం, కావ్యాలంకార నాటకాలు, గానం, కామ శాస్త్రం, కవిత్వం, జూదం, దేశభాషాలిపి జ్ఞానం, వ్రాయడం, చదవడం, అవధానం, స్వర శాస్త్రం, శాకునం, సాముద్రికం, రత్న శాస్త్రం, రథాది కౌశలం, మల్ల శాస్త్రం, వంట, దోహద క్రియలు, గంధ వాదం, ధాతు వాదం, ఖనిజ వాదం, రస వాదం, జల వాదం, అగ్ని స్తంభం, జల స్తంభం, ఖడ్గ స్తంభం, వాక్ స్తంభం, వయః స్తంభం, వశ్యం, ఆకర్ణనం, మోహనం, విద్వేషనం, ఉచ్చాటనం, మారణం, కాల వంచనం, పరకాయ ప్రవేశం, పాదుకా సిద్ధి, వాక్ సిద్ధి, ఘటికా సిద్ధి, ఐంద్రజాలికం, అంజనం, దృష్టి వంచనం, స్వర వంచనం, మణి సిద్ధి, మంత్ర సిద్ధి, ఔషధ సిద్ధి, దొంగతనం, చిత్ర రచనం, కమ్మరం, అశ్మ కర్మం (రాతి పని), మృత్కర్మం, వడ్రంగం, వేణు కర్మం, చర్మ కర్మం, నేత, కుక్కుటాది యుద్ధ కౌశలం, అదృశ్య కరణం, దూతీ కరణం, వేట, వర్తకం, పశు పాలనం, కల్లు గీత, క్షుర కర్మ.

--------------------------------------------------------------------

53

కృష్ణార్జునాభ్యాం పరిపూజ్య లిఙ్గ-

మాసాదితాః సిద్ధయ ఇత్యవేత్య

కస్తూరికాభిర్ఘనసారకైశ్చ

లిమ్పన్తి లోకాః ఖలు లిఙ్గమేతత్

తాత్పర్యము

పాండ్యదేశములోని ఈ సుందరనాథ శివలింగము కృష్ణార్జునులచేతచక్కగా పూజింపబడినదని,సిద్ధులను కలిగిస్తుందని తెలుసుకొని,

లోకులు కస్తూరిని( నలుపు కృష్ణునికి ప్రతీకగా)  పచ్చ కర్పూరమును( తెలుపు అర్జునునికి ప్రతీకగా) ఈ లింగమునకు పూయుచుందురు కదా;

విశేషాలు

1) ఆసాదితము

1.ప్రాప్తము, పొందబడినది.2. సిద్ధముచేయఁబడినది.3. దగ్గఱ

ఉంచబడినది. షౢద్ విశరణగత్యవసాదనేషు-ఆ + సాద్ (ణ్యంతః) +

క్త-ఇట్.(కృ.ప్ర.)

2) సిద్ధులు/ సిద్ధశక్తులు

సాధారణ వ్యక్తులకు ఉండని, అతీంద్రియ శక్తులను సిద్ధులుఅంటారు. ఇవి ఐదు విధాలని పాతఙ్ఞల యోగశాస్త్రం (కైవల్యపదం)

తెలియజేస్తున్నది. పూర్వజన్మలో సాధనవల్ల కలిగేవీ, దేవతలకుజన్మచేతనే కలిగేవీ జన్మసిద్ధులు. కొన్ని ఓషధుల వల్ల కలిగేవి

ఓషధిజ సిద్ధులు. కొన్ని మంత్రాలవల్ల కలిగే సిద్ధులుమంత్రసిద్ధులు. నాలుగోవి తపస్సు వల్ల కలిగే సిద్ధులు. సమాధి

స్థితివల్ల కలిగేవి సమాధి సిద్ధులు.

3) కస్తూరిక

కస్తూరి, కస్తురి, మృగీమదము. "కర్పూరచందనకస్తూరికాదుల నింపుసొంపార భోగింపగలదె." [మ.భా.(వి)-5-204]

4) కృష్ణార్జునులు

అన్నిటిని చేయువాడు, దైత్యులను నలిపివేయువాడు, కృష్ణవర్ణుడుఅని కృష్ణ పదానికి అర్థాలు.తెలుపు వన్నె కలవాడు అర్జునుడు

అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి తన అగ్నేయాస్త్రం విఫలంకాగా బాధ పడుతున్న అశ్వత్థామతో వ్యాసుడు ఇలా చెప్పాడు.

పూర్వజన్మలో అశ్వత్థామ మట్టితో శివుని బొమ్మను చేసిఆరాధించాడు.. అయితే కృష్ణార్జునులు పూర్వజన్మలో లింగాకారంలో

శివుణ్ణి అర్చించారు. శివదేవుని ప్రతిమ ఆరాధన కన్నా లింగార్చనఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కనుక అశ్వత్థామ కంటె కృష్ణార్జునులు

అధికులైనారు”. ( మహా భారతం)

5) లింగార్చన

లింగ రూపంలో శివుడిని అర్చించడం వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నదని స్వామి వివేకానంద పాశ్చాత్యులకు చెప్పారు

. చికాగో (అమెరికా)లో సర్వమత సమ్మేళనం జరిగిన కొంతకాలానికిపారిస్లో మతాల పుట్టుపూర్వాలను చర్చించడానికి మరొక సభ

జరిగింది. (The Paris Congress of the History of Religions. Ref:The Complete Works of SwamiVivekananda, pages 422-429.)

అందులో వివేకానందుడు పత్ర సమర్పణ చేసి ఉండవలసింది గానీఅనారోగ్యం వల్ల ఆయన చేయలేకపోయారు. గుస్తాప్ ఒప్పర్ట్ అనే

జర్మన్ పండితుడు శివలింగాన్ని పురుషుడి జననాంగం గానూ, సాలగ్రామాన్ని స్త్రీ జననాంగం గానూ వర్ణించి వ్యాఖ్యానించి నప్పుడు

వివేకానందుడు దానిని ఖండించాడు. శివ లింగం యజ్ఞశాలలోయూప స్థంభ పరిణామమేనని ఆయన వాదించారు. బౌద్ధులు

నిర్మించిన స్థూపాలు కూడా శివలింగార్చనకు స్ఫూర్తిని కలిగించిఉండవచ్చునని వాదించారు. శ్రీచందూరి సుబ్రహ్మణ్యం తాము

రచించిన ‘‘శివదర్శనమ్’’ గ్రంథంలో లింగార్చన బహు పురాతనమైనదనీ, ఇతర ఖండాలలో సైతం ఉన్నదనీ అనేక ఆధారాలు

చూపించారు.( : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు )

6) లిమ్పన్తి

లిప్ ఉపదేహే. తుదాదిగణము. పరస్మైపదీ. లట్. బహువచనం.

-----------------------------------------------------

54

సదాభిషిక్తం విబుధ స్రవన్త్యా

సదా సమభ్యర్చితమిన్దునా చ

లిఙ్గం తదైశం విజనే వనే౽పి

లోకత్రయ క్షేమకరం బభూవ

తాత్పర్యము

దేవతలనదియైన గంగచే నిరంతరము అభిషిక్తమయినది,చందురునిచేబాగుగా పూజింపబడినదయిన ఆ ఈశ్వరునికి

సంబంధించిన సుందరనాథ శివ లింగము జనులు లేనివనమందు కూడా మూడు లోకములకు శుభకరమై ఉన్నది.

విశేషములు

1) విబుధుడు

విబుధ్యంత ఇతి విబుధాః విశేషముగా ఎరిగినవారు. బుధ

అవగమనే

2) స్రవన్తి

స్రవతీతి స్రవన్తీ. స్రుస్రవణే. పర్వతమువలన స్రవించునది.

3) అభిషిక్తం

(రాజ్యము మొదలగువానియందు అధికారము సిద్ధించుటకై

సంస్కారపూర్వకముగా చేయింపబడిన) స్నానము.

4) ఇందుడు (చంద్రుడు)

వ్యు. ఉందీ = క్లేదనే-ఉంద్ + ఉః-ఆదేః ఇచ్చ. (ఔణా.) తన

కిరణములచేత తడుపువాడు.

5) ఐశము

ఈశునకు సంబంధించినది. ఏలికకు సంబంధించినది.వ్యు. ఈశ +

అణ్. (త.ప్ర.)

6) లింగము

లింగ్యతే జ్ఞాయతే అనేనేతి లింగం. లిగి గతౌ . దీనిచేత

ఎరుగబడును.

7) త్రిలోకములు

1. భూలోకము, 2. స్వర్గలోకము, 3. పాతాళ లోకము.

1.మనుష్య లోకము, 2. పితృలోకము, 3. దేవలోకము.

8) బభూవ

భూ సత్తాయామ్, భ్వాది గణము పరస్మైపదీ, లిట్ ఏక వచనం

---------------------------------------------------------------------------

56

కూజత్సు వన్యేషు విహఙ్గమేషు

గాయత్సు చాఖణ్డలగాయనేషు

ప్రీతిం దధే తుల్యవదేవ దేవః

కస్మాద్దృశా తేషు భవేద్విశేషః

తాత్పర్యము

అడవులయందు పుట్టిన పక్షులు కూయుచున్నను, దేవతల పాటగాండ్రు పాడుచున్నను  సమమగు సంతోషమునే సుందరేశ్వరుడు పొందాడు. భేదమయిన చూపు వానియందు ఎందుకు ఉండును?(శివునికి అన్నిటా సమానమైన దృష్టి ఉండునని భావం)

విశేషాలు

వన్యా

వనానాం సమూహో వన్యా. వనములయొక్క సమూహము;

విహంగమా

విహాయసా గచ్ఛతీతి విహగః, విహంగమశ్చ. ఆకాశమున పోవునది.(సామాన్యమైన పక్షి)

ఆఖండలుడు

ఖడి భేదనే-ఆ + ఖండ్ + కలచ్. (కృ.ప్ర.) (శత్రువులను, పర్వతములను) భేదించువాడు.

దధే

దధ ధారణే భ్వాది గణము ఆత్మనే పది లట్ ఉ.పు. ఏ. దధే దధావహే దధామహే

భవేత్

భూసత్తాయామ్ భ్వాది గణము పరస్మై పది విధిలిఙ్ ప్ర.పు. ఏ భవేత్ - భవేతామ్- భవేయుః

విశేషః

ఆసీద్విశేషా ఫలపుష్ప వృష్టిః ( రఘు. 2-14)

-------------------------------------------------------------------

57

వినోద్యతే యః కిల యోగిబృన్దై

ర్విద్యాధరైరప్సరసాం గణైశ్చ

వ్యాధైర్మృగైః పక్షిభిరప్యరంస్త

స దేవదేవాశ్చిరమత్ర లిఙ్గే

తాత్పర్యము

యోగి బృందములచేతను, విద్యాధరుల చేతను అప్సరోగణములచేతను వినోదించు ఆ దేవదేవుడయిన అశివుడు ఇచ్చట ఈపాండ్యదేశములో బహుదినములనుండి కిరాతులు,  మృగములు,  పక్షుల సంఘములతో  ఈశివలింగమునందు ఆడుకొంటున్నాడు.

విశేషాలు

1. విద్యాధరులు

దేవతలలో ఒక వర్గం. గుటికాంజనాది విద్యలు తెలిసిన జీమూత వాహనుడు, పుష్పదంతుడు మొదలైన వారు.

2. అప్సరసలు

దేవతాభేదము.

మేనక, రంభ, ఘృతాచి, తిలోత్తమ మొదలగువారు. అప్సరసలు కశ్యపునికి మునియందు పుట్టినట్లును పాలసముద్రమునందు పుట్టినట్లును చెప్పుదురు.

3. అరంస్త

రము క్రీడాయమ్ ప్ర.పు. ఏ.వ.ఆత్మనేపదీ

మల్లినాథసూరిగారి శ్లోకం ఇది. వాణీం కాణభుజీ మజీగణదవాసా సీచ్చ వైయాసికీ మంత్రస్తంత్ర మరంస్త పన్నాగ గవీ గు౦భేషు చాజా గరీత్/వాచామాచకల ద్రహస్య మఖిలం యశ్చాక్ష పాద స్ఫురాం లోకే భూద్యదుపజ్న మేవ విదుషాం సౌజన్య జన్యం యశః – (కణాద,గౌతమ తర్క శాస్త్రాలను ,వ్యాసకృత బ్రహ్మ సూత్రాలను ,మీమాంసా వ్యాకరణాలను క్షుణ్ణంగా అభ్యసి౦చాను ,కనుక మహా మహోపాధ్యాయ బిరుదు సార్ధకం) అన్నీ విశిష్టమైనక్రియాపద ప్రయోగాలే ;అజీగణత్, అవాసాసీత్ అరంస్త ఆజాగరీత్

-----------------------------------------------------------------------------

58

అంతర్హితావస్థితమత్ర లిఙ్గే

తమారరాధుస్తరవః ప్రసూనైః

శృఙ్గాగ్రకణ్డూయనతః కురఙ్గాః

నిర్మోకపట్టార్పణతో భుజఙ్గాః

తాత్పర్యము

పాండ్యదేశములో లింగమునందు దాగినట్లున్న ఆ పరమశివునిచెట్లు పూలతో పూజించాయి.జింకలు తమ కొమ్ములపై భాగముతో దురద తీరునట్లుగా రుద్దుతూపూజించాయి ;పాములు తమ కుబుసపు వలువలు అర్పించుచూ పూజ చేసాయి.

విశేషాలు

1) అంతర్హితము

మఱుగుపడినది.2. దాపబడినది.3. మాయమైనది.4. గూఢముగా

మేలు గూర్చునది.వ్యు. 1. అంతర్ + ధా + క్త - ధాతోః హిః. (కృ.ప్ర.)వ్యు.

2. అంతర్ + హితమ్ - అస్మాత్. (బ.వ్రీ.)

2) శృంగగ్రాహికాన్యాయం

1. కొట్టంలోని పశువులను చూపి 'ఏదీ నీ ఆవు' అని ప్రశ్నించినపుడు కొమ్ము పట్టుకొని ఆవును చూపినట్లు.

"శృంగగ్రాహికజెప్ప వేఱె తెరువుల్‌ సిద్ధింపమింజేసి చి,త్రాంగశ్రీనిధి

నవ్వధూమణిని స్థూలారుంధతీన్యాయమా, ర్గాంగీకారమునన్‌

వచించితిని, జంద్రాద్యోపమల్‌ సూచనా, భంగుల్‌ గాని

యదహస్సహస్రగుణసౌభాగ్యంబు లా యంగముల్‌."

(ప్రభావతీప్రద్యుమ్నం. 2-88)

కొమ్ము పట్టుకొన్న ఆవు వశమైనట్లు.

[ప్రధానాంశాన్ని గ్రహించినట్లైతే విషయమంతా అవగతమౌతుంది.]

3) ఆరరాధుః

ఆఙ్ ఉపసర్గ పూర్వక రాధ వృద్ధౌ ధాతువు దివాదిగణ, పరస్మై, లిట్,

రరాధ, రరాధతుః , రరాధుః

-------------------------------------------------------------------------------

59 .

సంధ్యాసు సంధ్యాసు గణైరదృశ్యై

రారాత్రికం సాధితమస్ఫుటం యత్

చక్రే జరజ్జమ్బుకవక్త్రలగ్నై

ర్జ్వలద్భిరేతజ్జ్వలనైః ప్రకాశమ్

టీక

తాత్పర్యము

ప్రమథ గణములు శివునికి అదృశ్య రూపములో అస్పష్టముగా సాయంకాలములలో ఏ నీరాజనము వెలిగించారో - ఆ నీరాజనము

ఇప్పుడు రాత్రి సమయములో ముసలి నక్కల ముఖములలో మండుతూ బాగ ప్రకాశిస్తోంది. (రాత్రి పూట ఆహరమునకై నోరు

తెరచిన -ఆకలిగొన్న - ముసలి నక్కలయందు ఆ హారతి ఎరుపు కనబడుతున్నదని భావం.)

విశేషములు

ఆరాత్రికము

పగటియందుకూడ వెలిఁగింపఁబడునది. నీరాజనము, ఆరతి.

వ్యు. ఆరాత్రౌ అపి నిర్వృత్తమ్‌-ఆరాత్ర + ఠఞ్. (త.ప్ర.)

చక్రే

డుకృఞ్ కరణే తనాది గణ,ఆత్మనే పదీ, లిట్, చక్రే- చక్రాతే- చక్రిరే

----------------------------------------------------------------------------

60వశ్లోకం

వన్యద్విపేష్వన్యతమో గణేశో

వ్యాధార్భకేష్వేకతమః కుమారః

సాప్యాదిశక్తిః శబరీషు కాపి

భూత్వా విజహ్నుః సవిధే పురారేః

తాత్పర్యము

అడవి ఏనుగులలో ఒకనిగా గణపతి,బోయపిల్లలందు ఒకనిగా కుమారస్వామి,చెంచు స్త్రీలయందు ఒకతెగా ఆ పరమేశ్వరుని మాయాశక్తి మారి

పాండ్యదేశములో వెలసిన సుందరనాథ శివలింగ సమీపములో విహరించిరి;

విశేషాలు

1) అన్యతమము :

సం.విణ.పెక్కింటిలో ఒకటి.వ్యు. అన్య + తమప్‌. (త.ప్ర.)

2) ద్విపము :

సంస్కృత విశేష్యము.ఏనుగు.వ్యు. రెంటితో త్రాగునది.

3) అర్భకుడు

శిశువు.సం.విణ.ఋ గతౌ ప్రాపణేపిచ-ఆర్యతే వృద్ధిం ప్రాప్యతే ఇతి-

ఋ + కన్‌-ధాతోః భకారః అంతాగమః నిపాతితః. (ఔణా.)

వృద్ధినొందింపబడువాడు.

4) ఏకతమము :

సం.విణ.పెక్కింటిలో ఒక్కటి. బహుష్వేకః-ఏక + తమప్‌. (త.ప్ర.)

----------------------------------------------------------------------------------

61

ఇత్థం పరిభ్రామ్యన్తి కాలచక్రే

ప్రణశ్యతి ప్రోద్యతి చ ప్రపఞ్చే

దేవేషు యోగిష్వపి కే౽పి కే౽పి

శనైరబుధ్యన్త రహస్యమేతత్

తాత్పర్యము

ఇట్లు కాలచక్రము తిరుగుచుండగా ,సమస్త జగములు పుట్టుచు నశించుచుండగా,సుందరనాథ శివలింగ రహస్యమును

కొందరు దేవతలు, యోగులు మాత్రమే తెలుసుకొనిరి.;

విశేషాలు

1) కాలచక్రము

సంస్కృత విశేష్యము

చక్రాకారమున తిరుగు కాలము.

2) పరిభ్రామ్యన్తి

పరి ఉపసర్గ పూర్వక భ్రము చలనే ధాతువు ప్ర.పు, బ.వ.పరస్మైపదీ

3) ప్రణశ్యతి

ప్ర పూర్వక ణశ్ అదర్శనే దివాది గణము, పరస్మై.,

4) అబుధ్యన్త

బుధ అవగమనే దివాదిగణము, ఆత్మనే పదీ, లఙ్ అబుధ్యత,

అబుధేతామ్, అబుధ్యన్త

------------------------------------------------------------------------

62

ప్రత్యగ్దృశా ప్రాక్తన పుణ్యయోగా

దాప్తోపదేశైరనుమానతశ్చ

క్రమాద్ద్యులోకే బహళీబభూవ

కదమ్బకాన్తారకథాప్రసఙ్గః

తాత్పర్యము

దివ్యతరదృష్టి, నాప్తోప దేశక లన మునను, ననుమానమునఁ, బూర్వపుణ్యవశత సీకదంబ కాంతారమ హేళుగాథ అల్లనల్లన స్వర్గమం దలమి కొనియె,

ఒక పూర్వజన్మ పుణ్యము ఉంటేనే అంతర్ముఖమగు దృష్టి (లోచూపు) కలుగుతుంది. దేవలోకములో కొంతమందికి ఈ అదృష్టము కలిగింది.తద్వారా వారు సుందరనాథుడు కొలువైన కదంబవన ప్రసంగాలు భక్తితో చేసుకోసాగారు. దేవలోకములో మరికొంతమంది ఆత్మీయుల ఉపదేశముల చేత, ఇంకొంతమంది అనుమానము వలన సుందరనాథుడు శివుడు కొలువైన కదంబ వన ప్రసంగాలు భక్తితో చేసుకోసాగారు.

కొందరు అంతర దృష్టి ద్వారా, గత జన్మల పుణ్యఫల ప్రభావం వల్ల, శిక్షణ (ఉపదేశం) ద్వారా, అనుమానం ద్వారా క్రమంగా దేవలోకంలో కదంబ అరణ్యానికి సంబంధించిన కథలు విస్తరించాయి.

విశేషాలు

1) ప్రత్యక్

అన్నింటిలో ఉండేది, దృశ్యం కంటె వేరైనది అయిన వస్తువు

2) అనుమానము

మాఙ్ = మానే అను + మా + ల్యుట్‌. (కృ.ప్ర.)

వ్యాప్యము జ్ఞానముచేత వ్యాపకము నిశ్చయించుట. (అగ్ని పొగకు వ్యాపకము. పొగ అగ్నికి వ్యాప్యము. పొగ ఉన్నచోట అగ్ని

ఉండుట పాకశాలలలో చూసి పర్వతమున కనబడుచున్నపొగను చూసి అక్కడ నిప్పు ఉన్నదని నిశ్చయించుట);

3) బభూవ

భూసత్తాయామ్, భ్వాదిగణము , పరస్మైపది, లిట్ ఏకవచనం

నీలకంఠ దీక్షితుల శివలీలార్ణవము ద్వితీయ సర్గ

63

దూరాత్ప్రణేముః కతిచిద్వనం త

దారాత్పరే నీపతరూనపశ్యన్

విచిక్యురేకే తదనుప్రవిశ్య

ధన్యాః పరే తద్దదృశుశ్చ లిఙ్గమ్

తాత్పర్యము

శివుడు వెలసిన ఆ కదంబ వనమును కొందరు దూరమునుండియే చూసి నమస్కరించారు. ఆలింగ సమీపమున మరికొందరు కదంబ

వృక్షములను చూసిరి ఆ కదంబ వనములోనికి ప్రవేశించి కొందరు శివలింగమునకై వెదకిరి; ధన్యులయిన ఇంకొందరు ఆ లింగ

తనువును చూసారు.

విశేషాలు

1) వనమ్

వన్యతే సేవత ఇతి వనం. వనషణ సంభక్తౌ . జనులచే

ఆశ్రయింపబడునది కనుక వనము.

ఏకోవాసః పత్తనే వా వనే వా (భర్తృ)

2) అపశ్యన్

దృశిర్ ప్రేక్షణే , భ్వాదిగణ, పరస్మై, లఙ్. అపశ్యత్, అపశ్యతామ్,

అపశ్యన్

3) పరే

యః పరేతి స జీవతి

4) లింగము

లింగ్యతే జ్ఞాయతే అనేనేతి లింగం. లిగి గతౌ . దీనిచేత

ఎరుగబడును.

పానవట్టము (The base or trench into which libations, poured onthe top of an idol, run down and flow to the spout. లింగపీఠము.)

పైన శివమూర్తి; గుఱుతు; పంచవింశతితత్వములలో(అష్టప్రకృతులు+ షోడశ వికారములు+ పురుషుడు)మొదటిదయిన ప్రకృతి అని లింగ శబ్దానికి అర్థాలు.

------------------------------------------------------------------------------

64

వికసించిన చూపులనే పూలతో శివుని పూజించారు(11-09-2017)

ఆనన్దజైరశ్రుభిరభ్యాషిఞ్చ

న్నానర్చురప్యక్షిభిరేవ ఫుల్లైః

న్యవేదయన్తాపి నితాన్తధౌత

మాత్మానమానన్దసుధాప్లుతం తే

తాత్పర్యము

ఆకదంబ వనములోని శివలింగానికి తమ ఆనందాశ్రువులతో స్నానము చేయించారు. వికసించిన పూలు అనే చూపులతో

పూజించారు. ఆనందరసమను అమృతములో తేలియాడుచున్న తమ స్వచ్ఛమయిన మనస్సును నివేదనగా ఆ దేవతలు

ఇచ్చారు.;

విశేషాలు

1) ఆనందము

టునది సమృద్ధౌ- ఆనందింపచేయునది

2) పంచ-ఆనందములు

1. విషయానందము, 2. యోగానందము, 3. అద్వైతానందము, 4. విదేహానందము, 5. బ్రహ్మానందము.

3) అష్టవిధ-ఆనందములు

1.బ్రహ్మానందము, 2. వాసనానందము, 3. విషయానందము, 4. ఆత్మానందము, 5. అద్వైతానందము, 6. యోగానందము, 7. సహజానందము, 8. విద్యానందము.

4) ఆశ్రువు(కన్నీరు)

అశూ వ్యాప్తౌ-అశ్ + కున్. (ఔణా.) కంటిని వ్యాపించునది

5) త్రివిధ-అశ్రువులు

ఆనందాశ్రువులు, 2. దుఃఖాశ్రువులు, 3. నక్రాశ్రువులు

6) ఫుల్ల

ఫుల్ల వికసనే. వికసించునది ప్రఫుల్లము, ఉత్ఫుల్లము, సంఫుల్లము

7) అక్షి

1. నేత్రము, కన్ను.

బహువ్రీహి సమాసమందు అకారాంతమగును. (జలజాక్షుడు మొ॥)

స్త్రీలింగమున ఈకారాంతమగును. (జలజాక్షి మొ॥) అవ్యయీభావ

సమాసమందు అకారాంతమగును. (సమక్షము, పరోక్షము మొ॥)

2. రెండు అనుసంఖ్యకు సంకేతము.

అశూ వ్యాప్త + క్సి. (కృ.ప్ర.) సుదూరము వ్యాపించుశక్తి (దృష్టి) కలది..

8) అక్షిత్రయము

1.కామాక్షి (కంచి), 2. మీనాక్షి (మధుర), 3. విశాలాక్షి (కాశి).

9) ఆనర్చుః

అర్చ పూజాయామ్ భ్వాది గణము, పరస్మై పదీ లిట్ ఆనర్చ, ఆనర్చతుః, ఆనర్చుః

10) ప్లావిత

వివిక్తేస్మిన్నగే భూయః ప్లావితే జహ్ను కన్యయా ( కిరాతా11-36)

---------------------------------------------------------------------------------

65

గూహత్సు యుష్మాస్వపి గూఢమేత

ద్రహస్యమద్రాక్ష్మ వయం కిలేతి

అనుశ్రవాన్కేచిదుపాలభన్త

కేచిద్విధిం కే౽పి శిలాదసూనుమ్

తాత్పర్యము

ఓ శ్రుతులారా ! ఓ బ్రహ్మా ! ఓ నందీశ్వరా !ఈ కదంబవనములోని శివలింగాన్ని మీరందరూ రహస్యాతి రహ్యంగా మాకు

తెలియకుండా దాచారు కదూ ! ఎంత మీరు దాచినా మేముకనిపెట్టాము అని కొందరు దేవతలు శ్రుతులతో, మరికొందరు

బ్రహ్మతో , ఇంకొందరు నందీశ్వరునితో మేలమాడారు.

విశేషాలు

1) యుష్మాసు

దకారాంత పుంలింగము సప్తమీ . బహువచనం

2) గూఢం

గుహూసంవరణే. దాచబడినది గుహ్యతేస్మ గూఢం

3) అద్రాక్ష్మ

దృశిర్ ప్రేక్షణే.భ్వాది గణము. పరస్మై పదీ లుఙ్ (aorist)

క్రూరస్త్వమక్రూర.....త్వదీయమద్రాక్ష్మ వయం మధుద్విషః (

సంస్కృత భాగవతం దశమ స్కంధం 39వఅధ్యా. 21 శ్లో)

విధాతా ! నువ్వు అక్రూరుని పేరుతో వచ్చిన  క్రూరుడివి. ఏ కనులతోశ్రీకృష్ణుని ఒక్క అవయవమునందైననూ..నీ సృష్టి నైపుణ్యాన్ని

మేము చూడకలిగామో, ఆ కన్నులు మాకు ఇచ్చి , తిరిగి అజ్ఞునిలా అపహరించావు.

4) అనుశ్రవము

శ్రు శ్రవణే-అను + శ్రు + అచ్. (కృ.ప్ర.) పరంపరగా

శ్రుతమైనది.పరంపరాగతమైన మంచి సంప్రదాయము.వైదిక

సంప్రదాయము.

5) విధి

విదధాతీతి విధిః . సర్వము చేయువాడు( బ్రహ్మ)

6) శిలాదుడు

నందీశ్వరుని తండ్రి పేరు శిలాదుడు. జపేశ్వరములో ఇతడురుద్రుని గూర్చి తపస్సు చేసి ఆచరించి అయోనిజుడైన

మృత్యుంజయుడయిన నందిని పుత్రునిగా పొందాడు.

--------------------------------------------------------------------------------

66

వాగీశ్వరా వాగ్భిరపూజయన్త

ధ్యానాధ్వనీనా హృది దధ్యురేనమ్

బాహ్యార్చమాత్ర పరాయణాస్తు

సామగ్ర్యలాభాదలభన్త ఖేదమ్

తాత్పర్యము

పండితులు తమ వాక్కులతో ఆకదంబవనములోని లింగమూర్తిని పూజించిరి;

ధ్యానము చేయువారు తమ హృదయములందు ఆ శివ లింగమూర్తిని ధరించిరి; కానీ, బాహ్యపూజకే పరిమితులైనవారు పూజా సామగ్రి  దొరకక అసంతృప్తిని అనుభవించారు

విశేషాలు

1) వాగీశ్వరుడు

వాగీశ్వరుడు మంజునాథుడు, వాగీశ్వరి సరస్వతి.

2) అపూజయన్త

పూజ పూజాయామ్, చురాదిగణ, ఆత్మనేపదీ, లఙ్ ( imperfect)

అపూజయత అపూజయేతామ్, అపూజయన్త

3) అధ్వనీనుడు

బాటసారి. పథికుడు.

అధ్వానమ్ అలం గచ్ఛతి - అధ్వన్ + ఖ + ఈనాదేశః. (త.ప్ర.)

4) ధధ్యుః

ధ్యై చిన్తాయామ్ భ్వాది గణము, పరస్మై పదీ లిట్ , దధ్యౌ దధ్యతుః దధ్యుః

5) అర్చ

పూజ. పూజించు ప్రతిమ.

అర్చ = పూజాయామ్-అర్చ్ + అఙ్- టాప్. (కృ.ప్ర.)

-----------------------------------------------------------------------

67

ఆలక్ష్య పూజావ్యవసాయమేషా

మపామభావాత్పరమం చ ఖేదమ్

దీనానుకమ్పానిధిరిన్దుమౌళి

ర్దివ్యం సరస్తత్ర విధాతుమైచ్ఛత్

తాత్పర్యము

తన పూజ చేయు భక్తులు ప్రయత్నము చేసిననూ నీరు లభించకపోవుటచే వారికి కలిగిన బాధను పరిశీలించి

దయాజలధి యైన చంద్రుని శిరస్సున ధరించిన శివుడు తన భక్తుల కొరకు ఆకదంబవనములో చాలా

మంచిదయిన కొలనును నిర్మించాలనుకొన్నాడు.

విశేషాలు

1) పూజా

పూజ పూజాయాం. పూజనం పూజా. పూజించుట

2) వ్యవసాయము

వ్యవసీయత ఇతి వ్యవసాయఃషో౽న్త కర్మణి. విశేషముగా నిశ్చయించుట వ్యవసాయము

3) అప్(ఆపః)

అప్ ఌ వ్యాప్తౌ . వ్యాపించునవి కనుక నీటికి అప్ అని పేరు( పకారాంత స్త్రీలింగ నిత్య బహువచనం)

4) ఇందుమౌళిః

ఇందుః మౌళౌ యస్య. (బహువ్ర్రీహి.) చంద్రుని శిరస్సున ధరించిన శివుడు

5) అనుకంప ( దయ;)

అను + కంప్ + అఙ్ + అ. (కృ.ప్ర.)

ఉప.

ఇచట "ఉప" అనునది ధాత్వర్థమును "కనికరము" అను అర్థములోనికి మార్చినది.

6) దివ్యము

మహావ్యవహారములయందు జయింపదగిన సత్యము, బాస;

ఇది అయిదు రకాలు - తులాదివ్యము, అగ్నిదివ్యము, జలదివ్యము, విషదివ్యము, కోశదివ్యము

7) ఐచ్ఛత్

ఇష ఇచ్ఛాయామ్ తుదాది గణము, పరస్మైపది, లఙ్ ప్ర.పు ఏక వచనము

8) దయానిధి

శివునికి సంబంధించి కవి ప్రయోగించిన దయాజలధి, చంద్రుని శిరస్సున ధరించిన వాడు అను విశేషణములు సాభిప్రాయములు.

------------------------------------------------------------------------------------

69

స దక్షిణస్యాం దిశి బాణపాతే

సరో విధాస్యన్నమృతాంశు మౌళిః

సకృద్విలాసాదివ నిర్బిభేద

తీక్ష్ణేన భూమిం త్రిశిఖాఞ్చలేన

తాత్పర్యము

ఆకదంబ వనమునకు కుడి వైపు సరస్సు నిర్మించుటకు; చంద్రమౌళి అయిన శివుడు, అపురూప బాణము పడుటలోని

విలాసము మనకు చూపదలచి, తన వాడి యయిన శూలపు చివరలతో భూమిని చీల్చాడు.(శివుని శూలము , బాణము చేసే పని

చేసిందని భావం. అదే విలాసము)

విశేషాలు

1) దిక్కులు

అష్ట-దిక్కులు

1.తూర్పు, 2. ఆగ్నేయము, 3. దక్షిణము, 4. నైరృతి, 5. పడమర, 6. వాయవ్యము, 7. ఉత్తరము, 8. ఐశాని.

2) దశ-దిక్కులు

1.తూర్పు, 2. పడమర, 3. ఉత్తరము, 4. దక్షిణము, 5. ఐశాని, 6

. నైరృతి, 7. వాయవ్యము, 8. ఆగ్నేయము, 9. ఊర్ధ్వదిశ, 10. అధోదిశ

[ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు, శివుడు, నిరృతి,

వాయువు, అగ్ని, బ్రహ్మ, శేషుడు-వీరు క్రమముగా దశదిశలకు

అధిపతులు].

3) నిర్బిభిదే

నిర్ ఉపసర్గ పూర్వకమైన భిదిర్ విదారణే. రుధాది గణము, పరస్మై

పది , లిట్ ప్ర.పు. ఏక

-------------------------------------------------------------

నీలకంఠ దీక్షితుల శివలీలార్ణవం ద్వితీయ సర్గ

70

ఆవిధ్య శూలం భువి సద్య ఏవ

పాదాఙ్గదం పశ్యతి సున్దరేశే

భక్తస్య తే న క్షతిరస్తి జాతు

శేషః సుఖీత్యాహ సుతా హిమాద్రేః

తాత్పర్యము

 

 

సుందరేశుడయిన శివుడు శూలమును భూమియందు వెంటనే దింపి తన కాలియందె అయిన నాగాభరణము వైపు చూసాడు.  అప్పుడు గిరిజ నవ్వుతూ “నీ భక్తులకు ప్పుడు నాశనము లేదు; ఆదిశేషుడు సుఖముగానే ఉన్నాడుఅని చెప్పింది.

విశేషాలు

1) పశ్యతి

దృశిర్ ప్రేక్షణే భ్వాదిగణము పరస్మైపది లట్ ఏకవచనము పశ్యతి

2) శూలం

శూలయతీతి శూలం. శూల రుజాయాం. బాధపెట్టునది కనుక శూలము.

3) అంగదము

అంగ దైశోధనే + క. (కృ.ప్ర.) శరీరమును భూషించునది.

4) శేషుడు

హరి ఇతని మీద శయనించును కనుక శేషుడు( శేతే హరిరస్మిన్నితి శేషః)

కల్పాంతములోనూ శేషించి ఉంటాడు కనుక శేషుడు( కల్పాంతేపి శిష్యత ఇతి వాశేషః)

5) ఆహ

బ్రూ (ఉభయ)- చెప్పుట

పరస్మైపదములో వర్తమానకాలములో ఏకవచనము బ్రవీతితో పాటు ఆహకూడా ఉంటుంది.

బ్రవీతి బ్రూతః బ్రువన్తి

ఆహ ఆహతుః ఆహుః

6) అమ్మవారి భక్తుడు ఆదిశేషుడు

రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటయిన కొల్హాపూర్ క్షేత్రంలో సేవలు అందుకొంటోంది

. ఇక్కడ సతీదేవి కళ్ళు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ లో ఉన్న.అమ్మవారి తలపై ఆదిశేషుడు ఐదుపడగలతో ఛత్రం

పడుతున్నట్టుగా ఇప్పటికీ మనకు కనబడతాడు.కనుక అమ్మవారికి సేవలు చేసే భక్తునిగా ఆదిశేషుని ప్రసక్తిని శివునితో కవి ఈ

శ్లోకంలో చెప్పించాడు.

7) ఆదిశేషుడు విష్ణువుకు పడక. ఆదిశేషుడు శివతాండవాన్నిచూడాలనుకొనే శివ భక్తుడు.( పతంజలి) ఆదిశేషుడు అమ్మవారి

భక్తుడు.శివుని శరీరం మీద వాసుకితో పాటు పాములు ఉన్నాయి.పాములు కుండలినీ శక్తికి ప్రతీకలు.

ప్రతి మనిషికీ వెన్నెముక క్రింది భాగం నుంచి మెదడు ప్రాంతంలోఉన్న పైభాగం వరకు ఆరు చక్రాలు ఉంటాయనీ, అట్టడుగున ఉన్న

మూలాధార చక్రం వద్ద చుట్టచుట్టుకొని ఉన్న సర్పాకార శక్తి సాధన వల్ల మేల్కొని ఒక్కొక చక్రాన్ని చేరుకొంటూ సహస్రారం

చేరుతుందనీ, ఈ క్రమంలో సాధకుడికి అనేక సిద్ధులుకలుగుతాయనీ శాస్త్రం. మూలా ధారానికి పైన ఉన్న చక్రం

స్వాధిష్ఠానం, దానిపైది మణిపూరం/ మణి పూర్వకం, దానిపైదిఆహతం/ అనాహతం, దానిపైది, అంటే ఐదవది విశుద్ధం,

అన్నింటికంటే పైన ఉన్నది ఆజ్ఞా చక్రం (ఆజ్ఞాఖ్య). అక్కడే ఉన్నసహస్ర దళ పద్మం చేరిన కుండలినీ శక్తి సమాధి స్థితిని

కలిగిస్తుంది.

ఒకటే దేవుడు శివుడు, విష్ణువుఅమ్మవారు. ఇలా రకరకాల పేర్లు.పాము (కుండలినీ శక్తి) అన్ని చోట్ల దైవ సంబంధం కలిగి ఉన్నట్లు

వర్ణనలు - దైవపు ఏకత్వానికి ప్రబల సాక్ష్యం.

---------------------------------------------------------------------------------

71

త్రైవిక్రమే కర్మణి శార్ఙ్గిణాపి

ప్రవర్తితం యత్కిల పూర్వమమ్భః

అధోగతిం ప్రాప తదేవ లేభే

శివాస్త్రయోగాద్గతిమిత్థమూర్ధ్వామ్

తాత్పర్యము

విష్ణుఁడు త్రివిక్రమఖ్యాతి వెలయునప్పు డాకబంధ మధోగతి నందెఁ గాని ఈతఱి శివత్రిశూలాభిఘాతవశత నూర్ధ్వగతి నంది పూతమై యొప్పెఁ గాదె,

మునుపు శార్ఙ్గమను ధనుస్సుకలిగి , వామనావతారములో  మూడులోకములను మూడడుగులుగా కొలచిన విష్ణువు (

త్రివిక్రముని) కర్మచే , గంగ  అధోగతిని పొందినది.  ( అధోభాగమున గల పాదములయందు పుట్టినది )

ఇప్పుడు అదే గంగ  శివుని యొక్క అస్త్రము తగిలి ఊర్ధ్వ గతిని పొందినది .

విశేషాలు

లేభే

డులభష్ ప్రాప్తౌ భ్వాదిగణము, ఆత్మనే పది లిట్ ఏకవచనం

అస్త్రము

అసు క్షేపణే-అస్ + ష్ట్రన్. (ఔణా.) పగవారిపై ప్రక్షేపింపబడునది.

అస్త్రములు (53)

అశని (శుష్కాశని, ఆర్ద్రాశని), అసిరత్నము, ఆగ్నేయాస్త్రము, ఐంద్రాస్త్రము (వజ్రాస్త్రము), ఐషీకము, కంకణము, కంకాలము, కాందర్పము, కాపాలము, క్రౌంచాస్త్రము, గద (శిఖరిగద, మోదకిగద), గభస్త్యస్త్రము, గాంధర్వాస్త్రము, చక్రము (దండచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము), తామసము, తేజఃప్రదము, తేజోపకర్షణము, త్వాష్ట్రికము, దమనము, దర్పము, నందనాస్త్రము, నారాయణాస్త్రము, పాశము (ధర్మపాశము, కాలపాశము, వరుణపాశము), పైనాకాస్త్రము, పైశాచము, ప్రమథాస్త్రము, ప్రశమనము, ప్రస్వాసనము, బ్రహ్మశిరోస్త్రము, బ్రహ్మాస్త్రము, మానవాస్త్రము, మాయావంతము, ముసలము, మోహనము, మౌసలము, వాయువ్యాస్త్రము, వారుణాస్త్రము, విద్యాధరాస్త్రము, విలాపనము, శక్తి, శిఖరాస్త్రము, శిలేషు మానవాస్త్రము, శైవశూలము, శోషము, సంతాపనము, సంవర్తనము, సత్యాస్త్రము, సర్వమాయాదమనము, సుధామనము, సోమాస్త్రము, సౌమనస్యము, సౌరము, హయశిరము. (ఆంధ్ర వాచస్పత్యము కొట్ర శ్యామలకామశాస్త్రి)

వామనావతారం

స్వతలస్వచ్చతరారుణత్వ రచితస్వస్త్రిః పరేడ్భ్రాంతి వా

క్ప్రతికూలత్వ దశానుకారి గళగాద్గద్యక్షమాంభోజ భూ

నుతి హాసన్నఖరోర్ధ్వ సారిత పదార్ణోరుడ్జ గంగాసవా

ప్రతిమాళీశ కపర్ద మండల వటుబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - )

భావం -

ఓ వామనావతారా ! నీ పాదపద్మం చాలా ఎఱ్ఱగా ఉంది. అందుకని బ్రహ్మగారి శరీర పు రంగు మారిపోయింది. అప్పుడు సరస్వతీదేవికి

ఇతడు నా భర్తా? లేక పరస్త్రీ భర్తా? అనే సందేహం వచ్చింది. నిన్ను పొగడటానికి ప్రయత్నించే బ్రహ్మ మాట గద్గదం అయింది.

అది చూసిన నీ తెల్లని గోళ్ళు నవ్వుతున్నాయా అన్నట్లున్నాయి.పైకి ఎగబ్రాకిన నీ పాదం మీద గంగ మకరందంలా ఉంది. ఈశ్వర

జటాజూటం ఉండే ఆకాశం తుమ్మెద అయితే - పైకి ఎగబ్రాకిన నీపాదం మీద గంగ మకరందంలా ఉంది. అలాంటి నిన్ను

పొగుడుతున్నాను దీక్షితుల వారిదయినా, ఎలకూచి వారిదయినా కవితాచమత్కారాలు ఆ శ్లోక పద్యాలు. .అంతవరకే వాటిని మనం

స్వీకరించాలి..

-----------------------------------------------------------------------------------

73

దిదృక్షమాణేన మహాద్భుతం త-

చ్ఛివేన యావన్నమితో స మౌళిః

తావత్సరస్తత్కృత ముత్తరఙ్గం

తతః స్రవన్త్యా విబుధ స్రవన్త్యా

తాత్పర్యము

ఆ మహాద్భుతమును చూచుటకు ఆత్మలో తలచి, పరమశివుడు తన మౌళిని వంచెనో లేదో- గంగ కిందికి దిగి పొంగిపొరలు ఉత్తుంగములగు కెరటములతో కొలను సమృద్ధ జలములతో ఆకాశగంగతో సమానముగా ప్రకాశించింది..

విశేషాలు

1) స్రవంతి

గిరిభ్యః స్రవతీతి స్రవంతీ. స్రు స్రవణే. పర్వతమువలన స్రవించునది.(నది)

2) అద్భుతము

వింతయైనది. ఆశ్చర్యకరము.

అద్ఆకస్మికమ్ -అద్ + భా + డుతచ్. (కృ.ప్ర.) ఆకస్మికముగా భాసించునది.

3) దిదృక్ష

చూడనిచ్ఛ ( దిదృక్ష)జయింపనిచ్ఛ (జిగీష)చంపనిచ్ఛ( జిఘాంస)రక్షింపనిచ్ఛ (రిరక్ష)గ్రహింపనిచ్ఛ( జిఖృత్స)తెలియనిచ్ఛ( జిజ్ఞాస)

విడువనిచ్ఛ (జిహాస)మోక్షము పొందనిచ్ఛ( ముముక్ష)చావనిచ్ఛ ( ముమూర్ష)

4) యావత్తైలం తావద్వ్యాఖ్యానన్యాయం

వ్యాఖ్యాత వ్యాఖ్యానం రాస్తూ దీపంలో నూనె ఉన్నంతవరకు వ్యాఖ్యానం రాస్తానని చెప్పినట్లు. [సాధన సామగ్రి ఉన్నంతవరకు కార్యాన్ని నిర్వర్తించడమని భావం.(ఇటువంటిదే యావత్స్నానంతావత్పుణ్యమ్)

5) మౌళి

మల్యత ఇతి మౌళిః . మలమల్లధారణే. ధరింపబడునది.

----------------------------------------------------------------------------

75

సరస్త్రిశూల ప్రభవం పురారే

స్తథాత్యగాధం తదభూత్క్షణేన

యథాత్ర దేవో౽వతరన్ప్లవేత

త్రివిక్రమః క్రాన్త జగత్త్రయో౽పి

తాత్పర్యము

త్రివిక్రమావతారములో విష్ణువు మూడు లోకాలను ఆక్రమించాడు.ఆయనకు తెలియని లోతులు లేవు. కాని అటువంటి త్రివిక్రమునికే

మరలా అవతరించి శివుని త్రిశూలమున పుట్టిన బాగా లోతు కలిగినసరస్సు లో ఈతకొట్టాలని అనిపించింది.( శివుని త్రిశూలమున

పుట్టిన సరస్సు బాగా లోతు కలిగినదని అతిశయోక్తి)

భాషా విశేషాలు

1) ప్లవేత - ప్లు ధాతువు. విధి లిఙ్ ప్ర.పు. ఏ.వ.ఆత్మనేపది

2) అభూత్ భూసత్తాయమ్- భ్వాది గణము పరస్మైపదీ, లుఙ్ ప్ర.పు. ఏ.వ.

3) అగాధము(తెలియశక్యము కానిది.)

న + గాధః - అత్ర. (నఞ్ బహువ్రీహి సమాసము)

76

నౌర్వాన్న రామాన్న చ కుమ్భయోనే

ర్యస్యాస్తి భీతిస్తదవేక్ష్య తీర్థమ్

ఆశ్వాసమాజగ్మతురర్ణవస్థౌ

శశ్వత్తనౌ తావపి కూర్మ మీనౌ

తాత్పర్యము

బడబాగ్ని వల్ల , శ్రీ రాముని వల్ల, అగస్త్యుని వల్ల తమకు  భయము లేదని శివునిచే చేయబడిన తీర్థమును చూసి , సముద్రములో ఉన్న ఆది కూర్మము (తాబేలు) , మత్స్యము మాటి మాటికి ధైర్యాన్ని పొందాయి.

విశేషాలు

1) ఔర్వుడు

ఊర్వుని కొడుకు ఔర్వుడు.

ఊర్వుడు అత్యుగ్రతపము చేసే సమయములో నారదాది దేవర్షులును, బ్రహ్మర్షులును వచ్చి ఒక పుత్రుని పొందుముఅని కోరారు. ఊర్వుడు ఒక ఱెల్లుపోచను చేతిలో పట్టుకొని తన తొడను అగ్నియందు ఉంచి మథించాడు. ఆ తొడనుండి జ్వాలలతో కూడిన కుమారుడు ఒకడు పుట్టాడు.. అంత బ్రహ్మ ప్రార్థనచేసాడు. అప్పటినుండి ఊర్వుడు తన పుత్రుడైన ఔర్వునిసముద్రములో బడబాముఖమున నివసించేటట్లు, ఆ సముద్రపు నీరు అతడు ఆహారముగ తీసుకొనునట్లు నియమించాడు.

2) శ్రీరాముడు

శ్రీరామునికి సముద్రముపై ఆగ్రహము కలిగిన సందర్భము బాలకాండలో సంక్షిప్తముగా ఇట్లు చెప్పబడినది.

తత: సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధే:|

సముద్రం క్షోభయామాస శరై రాదిత్యసన్నిభై: || (79)

రాముడు సుగ్రీవసహితుడై సముద్ర తీరమునకు వచ్చాడు.. అచ్చట, సముద్రుడు దారి ఇవ్వలేదు. రాముడు కోపించి, సూర్య కాంతి పోలిన బాణములతో సముద్రుని బెదిరించాడు.

దర్శయామాస చాత్మానం సముద్ర: సరితాం పతి:|

సముద్రవచనాచ్చైవ నలం సేతు మకారయత్|| (80)

నదీపతి యగు సముద్రుడు, రాముని కోపమునకు బెదిరి తన నిజరూపముతో ప్రత్యక్షమయ్యాడు. రాముని శరణు వేడాడు.. రాముడు, సముద్రునిపై దయ తలచి, తన అస్త్రాలను ఉపసంహరించాడు. , నలుడను ఒక వానర శ్రేష్ఠునితో సముద్రముపై సేతువు నిర్మింప చేసాడు

3) అగస్త్యుడు

కశ్యప ప్రజాపతికి కాలయందు పుట్టినవారు కాలకేయులు. . వీరు మహాదుర్మార్గులు. సముద్రమున దాఁగి ఉండి అనేకరకాలుగా దేవతలను బాధించేవారు. అగస్త్యుని దేవతలు ప్రార్థించారు. అప్పుడు అగస్త్యుడు కాలకేయుల నివాసస్థానము ఐన సముద్రము యొక్క నీరంతా పానముచేసాడు.

4) అవేక్ష

ఈక్ష-దర్శనే-అవ + ఈక్ష + అః (కృ.ప్ర.)

5) అర్ణవము

అర్ణాంసి సంత్యస్మినిత్యర్ణవః జలములు కలిగినది

6) ఆజగ్మతుః

ఆఙ్ పూర్వక గమ్ ౢ గతౌ భ్వాది గణము పరస్మైపది లిట్ ప్ర.పు. ద్వివచనము జగామ జగ్మతుః జగ్ముః

7) కూర్మము

ఊర్మి అనగావేగము. కుత్సితమైన వేగము కలది కనుక కూర్మము అని ఒక అర్థం. ఊర్వీ హింసాయం. నీటిని చెరుచునది కనుక కూర్మము అని ఇంకో అర్థం.

విష్ణువుయొక్క దశావతారములలో రెండవ అవతారము.

ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతంలో కూర్మాచలం అనే క్షేత్రం ఉంది. అక్కడే ఉన్న హింగుళా దేవి ఆలయానికి కొద్ది దూరంలో జ్యేష్ఠ బహుళ త్రయోదశి నాడు శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించాడని ఐతిహ్యం. తెలుగునాట శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం పుణ్యక్షేత్రం.

8) మత్స్యము

మదీ హర్షే. మాంసమును హరించే కోరిక చేత సంతోషపడుతుంది కనుక మత్స్యము.

విష్ణువుయొక్క దశావతారములలో మొదటి అవతారము. సోమకుడు అను రాక్షసుడు వేదములను అపహరించి సముద్రములో దాగిన సమయములో విష్ణువు మత్స్యావతారము ఎత్తి వానిని చంపి వేదములను తెచ్చాడు..

77

ఆవిర్భవన్తీః సలిలే సమన్తా

దమ్భోజినీరూత్పలినీశ్చ తస్మిన్

దృశౌ పిబన్త్యౌ పరమస్య ధామ్నః

ప్రీతిం పరాం ప్రాపతురర్క చన్ద్రౌ

తాత్పర్యము

అశివుని శూలముచే ఆవిర్భవించిన కొలను నీటియందు తామరతీగలు నల్లకలువల తీగలు మొలవగా వాటిని చూసి ఇంపార గ్రోలుచూ శివ పరమాత్మయొక్క కంటి వెలుగులైన సూర్య చంద్రులు శ్రేష్ఠమైన సంతోషమును పొందిరి;

విశేషాలు

సమంతాత్

సమంతతః , పరితః, సర్వతః, విష్వక్ , సమంతాత్ ఇవి అంతట అను అర్థంలో వర్తించును;

సలిలము(నీరు)

సరతీతి సలిలం. సృ గతౌ. ప్రవహించునది. రలయో రభేదః . సలతీతి సలిలం . షలగతౌ . పోవునది

సలిలాదిత్యన్యాయము

జలసూర్యునివలె.

వాస్తవమున సూర్యుడొకడే . అయినా నీటిలో అన్ని తరంగములయందును ప్రతిఫలించి అంతమంది సూర్యులుగ కనబడతారు. ఈశ్వరు డొకడే .అయినా అనేకోపాధులను ఆశ్రయించి అనేకరూపములుగ కనబడతారు

అర్కుడు

అర్చ్యత ఇతి అర్కః పూజింపబడువాడు అర్కుడు. సూర్యుడు

చంద్రః

చది ఆహ్లదనే-చందయతీతి చంద్రః సంతోషింపచేయువాడు (చంద్రుడు)

78

త్రైగుణ్య రూపం త్రిశిఖం హి శమ్భో

ర్ధీరా జగత్కారణమామనన్తి

తత్సంప్రసూతే౽పి సరస్యముష్మి

న్కా హేతుచిన్తా కమలోత్పలానామ్

తాత్పర్యము

విద్వాంసులు ఆ శివుని త్రిశూలపు మూడు మొనలు అఖిల  జగములకు హేతువని ఒప్పుకొంటారుకదా.మరి-

ఆ శివుని కారణముగా ఏర్పడిన ఈ సరస్సులో పుట్టినపద్మాల, నల్లకలువల యొక్క హేతు విచారము( కారణ చర్చ) ఎందుకు?

విశేషాలు

1) ధీరః

ప్రశస్తాం ధియం రాతీతి ధీరః రా ఆదానే. మంచి బుద్ధిని గ్రహించువాడు(విద్వాంసుడు)

2) 'కశ్చిద్ధీర: ప్రత్యగాత్మానమైక్షత్

ఆవృత్త చక్షు: అమృతత్త్వమిచ్ఛన్'( కఠోపనిషత్తు.)

ఇంద్రియాలది బాహ్య ప్రవృత్తి . కన్ను బయటనున్న వస్తువుల్నే చూస్తుంది శరీరం లోపలున్న వస్తువుల్ని చూడ దు. చెవి బయట

నున్న శబ్దాల్నే వింటుంది గాని శరీరం లోపలనుండి వినబడే శబ్దాల్ని వినదు. బాహ్యప్రవృత్తి కలిగిన ఇంద్రియాలను

అంతర్ముఖం చేయగలిగినవాడు ధీరుడు. అతడే అమృతత్వ రూపమైన మోక్షాన్ని పొందగలడు.

3) 'వికారహేతౌ సతి విక్రియంతే

యేషాం న చేతాంసి త ఏవ ధీరా:' అని కాళిదాసు కుమారసంభవం. (01-59)

వికారం పొందే పరిస్థితులు ఎన్ని ఉన్నా ఎవరి మనస్సు ఎటువంటి వికారమూ పొందదో అతడే ధీరుడు.

4) శంభుః

శం సుఖం భవతి అస్మాత్ శంభుః. శమ్మనగా సుఖము. అది ఈయన వలన కలుగును కనుక శంభువు. భూసత్తాయాం

5) ఆమనన్తి

ఆఙ్ పూర్వక మ్న అభ్యాసే ధాతువు లట్ పరస్మైపదము

ప్ర.పు.బహువచనం

6) కమలము

జలం అలతి భూషయతీతి కమలం. అల భూషణాదౌ. జలమును భూషించునది. కేల మల్యతే ధార్యతే ఇతి వా కమలం. మలమల్ల ధారణే. జలము చేత ధరింపబడునది కనుక తామరపువ్వుకు కమలమని పేరు.

7) ఉత్పలము

ఉత్ ఊర్ధ్వం పలతి గచ్ఛతీతి ఉత్పలః . పల గతౌ. ఊర్ధ్వమును పొందునది కనుక కలువకు ఉత్పలమనిపేరు. ఉత్పల కువలయ శబ్దములు సామాన్యముగా ఉత్పల వాచకాలయినప్పటికి, విశేషములైన నీలోత్పలము( నల్లకలువ) మొదలయిన వాటియందు వర్తిస్తాయి.

8) హేతువిచారము

ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మకుండా తర్కించి అందులోని మంచి సెబ్బరలను, ధర్మాధర్మాలను విమర్శించి ఒక అభిప్రాయానికి రావడం హేతువాద లక్షణం.

త్రిశూలపు మూడు కొనలతో మూడు జగాలు ఏర్పడుతున్నాయని ఒప్పుకొన్నప్పుడు విభిన్న కాలాలలో వికసించే పద్మాలు, నల్లకలువలు ఒకే సారి ఆసరస్సులో ఎలా పుట్టాయని విచికిత్స అనవసరం. శివుడు ఏమైనా చేయగలడు.

----------------------------------------------------------------------------------------

79

శైవాలనీలం బహిరమ్బుజాభ

మన్తర్ఘటైరుద్ధ్రియమాణమచ్ఛమ్

త్రైగుణ్యరూపం త్రిశిఖోద్భవం త

దమ్భో నిజాన్హేతుగుణాన్వ్యనక్తి

తాత్పర్యము

నీటి ఉపరితలం శైవాలం వల్ల నీలంగా కనిపిస్తుంటే, లోపల అది పద్మవర్ణంగా (కమల వర్ణం) మెరిసిపోతుంది. అదే నీటిని మట్టికుండల ద్వారా పైకి తీస్తే, అది స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే, ఈ జలాన్ని మూడు గుణాల (సత్వ, రజ, తమ) రూపంగా భావించవచ్చు, మరియు ఇది శివుని త్రిశూలం నుండి ఉద్భవించినదిగా గుర్తించబడుతుంది. ఇలా ఆ  నీరు తన మూల స్వభావాన్ని తెలిపే  త్రిశూల గుణాలను వెల్లడిస్తుంది.

80

ప్రాచీనమబ్జం పరిహృత్య సద్యో

జగ్రాహ భానుర్జలజం తదీయమ్

అత్రైవ లక్ష్మీః స్థితిమాబబన్ధ

చతుర్ముఖో౽తశ్చకమే ప్రసూతిమ్

తాత్పర్యము

సూర్యుడు  చాలాకాలం నుంచి చేతిలో ధరించిన పద్మమును వదిలి  వెంటనే అపుడు ఆ శివసృష్టి అయిన కొలనులోని పద్మమును  గ్రహించాడు.

కొలనులోని పద్మమునందే లక్ష్మి ఎప్పుడు ఉండాలనుకొంది.అందువల్ల బ్రహ్మ కూడా ఆ శివసృష్టి అయిన కొలనులోని పద్మమునందే పుట్టాలనుకొన్నాడు.( ఆ శివసృష్టి అయినకొలనులోని పద్మము గొప్పదని అతిశయోక్తి)

విశేషాలు

1) భానుః

భాతీతి భానుః . భాదీప్తౌ. ప్రకాశించును కనుక భానువు;

అబ్జము(పద్మము)

అద్భ్యః జాయత ఇత్యబ్జః . జనీప్రాదుర్భావే. నీళ్లవలన పుట్టునది

-----------------------------------

81

ఆచామత స్నాత సరస్యముష్మి

న్నస్యామ్భసా మామభిషిఞ్చతేతి

దేవాన్మహర్షీనపి చాన్వగృహ్ణా

ద్వాచా భగిన్యా విభురాగమానమ్

తాత్పర్యము

ఈ సరస్సునందు స్నానమాడి ఆచమనంబు చేసి ఈ నీటితో  నన్ను అభిషేకము చేయుడని ప్రకాశవంతమైన

అనుగ్రహవాక్కుచే తన సన్నిధికి వచ్చుచున్నదేవతలను మహర్షులను  ఆ వేద ప్రభువయిన శివుడు   అనుగ్రహించెను.

విశేషాలు

1) అముష్మిన్

సకారాంత నపుంసక లింగము అదస్(ఇది) సప్తమీ విభక్తి ఏ.వ..

అముష్మిన్- అముయోః - అమీషు

2) సరః (సరస్సు)

సరతి ప్రవహతీతి సరః . సృ గతౌ. ప్రవహించునది;

3) అస్యామ్

మకారాంత స్త్రీ లింగము ఇదమ్ శబ్దమ్(ఈమె) సప్తమీ విభక్తి

ఏ.వ.. అస్యామ్- అనయోః/ఏనయోః- ఆసు

4) అమ్భః(నీరు);

అమతి గచ్ఛతీత్యంభః అమగత్యాదిషు. పోవునది;

5) మామ్ ( నన్ను )

దకారాంత పుంలింగము అస్మత్ శబ్దము ద్వితీ.వి.ఏ.వ. మామ్/

మా- ఆవామ్/నౌ- అస్మాన్/నః

6) అభిషిఞ్చత(అభి+సిఞ్చత)

అభి పూర్వకమైన షిచ్ క్షరణే ధాతువు. తుదాదిగణము.

పరస్మైపది, లోట్. మ.పు. బ.వ. సిఞ్చ- సిఞ్చతమ్- సిఞ్చత

7) దేవాః (దేవతలు)

దీవ్యంతీతి దేవాః క్రీడించువారు కనుక దేవతలు దివ్ క్రీడాదౌ

8) మహర్షి(మహా+ఋషి)

జ్ఞానస్య పారగమాత్ ఋషిః. ఋ గతౌ . జ్ఞానము యొక్క

పారమును పొందినవాడు.

9) వాచా( వాక్కుతో);

చకారాంత నపుంసక లింగ శబ్దము తృతీయావిభక్తి. ఏ.వ. వాచా

వాగ్భ్యామ్ వాగ్భిః

82

ఖాతం శూలశిఖాఞ్చలేన సలిలైః పూతం జటాతీర్థజైః

ప్రత్యక్షేణ చ శాంభవేన విధినా ప్రాప్తం పరాం గ్రాహ్యతామ్

తీర్థం తత్ప్రతి పద్య తాపసగణ భాగీరథీం తత్యజు

ర్మన్దం చాదర మాదధుః సురగణా మన్దాకినీస్రోతసి

తాత్పర్యము

పరమశివుని శూలముతో తవ్వబడినదై , ఆశివుని  జటాజూటమునుండి పుట్టిన నీటితో పవిత్రమగుచు ప్రత్యక్షముగా

శైవ విధిచే ఎక్కువ గ్రాహ్యతను పొందిన ఆతీర్థమును సేవింపదొడగి తాపస గణములు గంగను త్యజించారు. దేవతాసమూహములు

మందాకినీ ప్రవాహముపట్ల అల్పమైన ఆదరమును చూపించారు. (శివుని చేత కల్పింపబడిన సరస్సు మందాకిని కంటె గొప్పదని

భావం).

ఇంతవరకు తెలుగులో ఎవరూ తాత్పర్యము వ్రాయని  శివలీలార్ణవములోని ద్వితీయసర్గకు పరమశివుని దయతో తాడేపల్లి పతంజలి అను

జిజ్ఞాసువు రచించిన వ్యాఖ్యానము సమాప్తము.

                                                            ____

 

No comments:

Post a Comment

శివలీలార్ణవము - సర్గల పేర్లు - లింకులు

శివలీలార్ణవము - సర్గల పేర్లు - లింకులు ( లింక్ పై క్లిక్ చేస్తే సర్గ ఓపెన్ అవుతుంది)  22 సర్గల సారాంశము  https://neelakanthadikshitar.blogsp...